ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ప్ర భావాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యలు స్పష్టంగా కనిపించాయి. హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో జన సంచారం తగ్గింది. ప్రజలు పలు వ్యాపార కూడళ్ల వద్ద మాస్కులు ధరించి కనిపించారు. నిత్యం కిక్కిరిసిసోయే ప్రాంతాలు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారా యి. జనసమ్మర్థం ఎక్కువ ఉండే ప్రాంతాలు బోసిపోయాయి. ఆదివారం వచ్చిందంటే చాలు సినిమా హాళ్లు, పార్కులు, పలు షాపింగ్ మాల్స్, ప్రధాన మార్కెట్లు క్రయ, విక్రయాలతో కిటకిటలాడేది. అలాంటిది కరోనా ప్రబలకుండా ముందస్తుగా సినిమా హాళ్లు, పార్కులను బంద్ చేశారు. దీంతో ప్రజలు కూడా పెద్దగా బయటకు రాలేదు. తమ వెంట వచ్చే చిన్న పిల్లలు, వృద్ధ్దులకు మా స్కులను ధరించి తీసుకురావడం కనిపించింది. జనసంచారం లేకపోవడంతో నగరాల్లోని పలు వ్యాపార సముదాయాల్లో క్రయ విక్రయాలు స్తంభించాయి. అలాగే నిత్యం కార్యక్రమాలు జరిగే హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కళావేదికలు కూడా మూతపడ్డాయి. అయితే ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైళ్లలో కూడా ప్రయాణీలకు సంఖ్య తక్కువగా కనిపించింది. మరోవైపు కరోనా నివారణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కరోనాపైనే చర్చ చేసుకోవడం కనిపించింది. అయితే పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇతరులు తమ కార్యక్రమాలను, సదస్సులు, సమావేశాలను రద్దు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగాణాలు, పార్కులు, పబ్బులు, బార్లను మూసివేశారు. చాలా చోట్ల మార్చి 31 తర్వాత పునఃప్రారంభిస్తామనే గమనికలతో కూడిన ‘ఫ్లెక్సీ’లు దర్శనమిచ్చాయి. విద్యాసంస్థలతో పాటు క్రీడా ప్రాంగణాలు, బార్లు, పబ్బులను, పర్మిట్ రూములను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. మరో వైపు చాలా మంది మాస్కులు ధరించి కనిపించా రు. కరోనా వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా జనాలు పెద్దగా రహదారులపైకి రాలేదు. ప్రతి ఆదివారం సినిమాహాల్లు, పార్కులు, ప్రధాన కూడళ్లు జనాలతో కిటకిటలాడేటవి. కరోనా ప్రభావంతో ఎవ్వరూ పెద్దగా బయటకు వచ్చేందుకు ఆసక్తి కనబర్చలేదు. హైదరాబాద్‌లోని ప్రముఖ బ్యాట్‌మెంటన్ స్టార్ పుల్లెల గోపిచంద్‌కు చెందిన అకాడమిని జిహెచ్‌ఎంసి సిబ్బంది బంద్ చేయించారు. అకాడమి గేట్‌కు నోటిసు అతికించారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్లేగ్రౌండ్‌లు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు, ఆట స్థ లాల గేట్‌లకు తాళాలు వేశారు. ప్రైవేట్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, కోచింగ్ సెంటర్లకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర పట్టణాలలో కూడా నగర వాసులు పెద్దగా బయటకు రాలేదు.
సొంతూళ్లకు విద్యార్థులు : పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ప్రధానంగా ఉస్మానియా, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వైద్య విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. 19 నుండి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థులు మాత్రం హాస్టల్స్‌లలోనే ఉండి చదువుకుంటున్నారు.
కరోనా వైరస్‌పై వదంతులు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
కరోనా వైరస్‌పై వదంతులు వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమా ర్ హెచ్చరించారు. వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేసినా, వదంతులు వ్యాపింపచేసినా చర్యలు తప్పవన్నారు. ‘జాతీయ విపత్తు నిర్వహణ మండలి చట్టం 5.1 ప్రకారం’ అలాంటి వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్‌పై దుష్ప్రచారం చేస్తూ పట్టుబడితే ఏడాది వరకు జైలు శిక్ష తప్పదన్నారు. సమాజానికి చెడు చేయడమేనని, వీటి వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్నదని అంజనీకుమార్ అన్నారు.
కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : సైబారాబాద్ సి.పి సజ్జనార్
కరోనా వైరస్ పట్ల సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరికరాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సజ్జనార్ మాట్లాడుతూ ఇతర దేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైర స్ లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ లో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్, శానిటైజర్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.
అంతా నిర్మానుష్యం
RELATED ARTICLES