రాజకీయ సిద్ధాంతాలతో పట్టింపులు లేవు
ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని ఆశీస్సులు కావాలి
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టీకరణ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణం
మంత్రులుగా మరో ఆరుగురు ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: ఢిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో పరిపాలన సజావుగా జరిగేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కావాలని కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడోసారి కేజ్రీవాల్ హస్తిన పీఠాన్ని అధిష్ఠించారు. భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరిట ఈ కార్యక్రమం అట్టహాసం గా జరిగింది. తొలి నుంచి అనుకున్నట్లుగానే కేజ్రీవాల్ తిరిగి పాత మంత్రులనే తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. మనీష్ సిసోడియా, కై లాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్, సత్యేంద్ర జైన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్మిక మంత్రిగా పనిచేసిన గోపాల్ రాయ్ స్వాతంత్రోద్యమంలో అసువులుబాసిన అమరవీరులపై ప్రమాణం చేశారు. రాజేంద్రపాల్ గౌతమ్ బుద్ధునిపై ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, మీ బిడ్డను ఆశీర్వదించండంటూ ఢిల్లీ వాసులకు శనివారం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిపోయాయి. రాజకీయాలు కూడా ముగిశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థులు తమపై తీవ్రస్థాయిలో చేసిన విమర్శలను క్షమిస్తున్నానని చెప్పారు. తాను ఢిల్లీ పుత్రుడని తనకు తానుగా చెప్పుకుంటూ ఈ విజయం తానొక్కడిది కాదని, ఢిల్లీకి చెందిన ప్రతి ఒక్కరిదని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోడీ ఆశీస్సులు కోరుతున్నానని చెప్పారు. ప్రమాణస్వీకారానికి మోడీని ఆహ్వానించామని.. ఆయన వేరే పనుల్లో తీరిక లేకుండా ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. మీ బిడ్డ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారన్నారు. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, ఇది మీ విజయమని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపలేదని.. అన్ని వర్గాలకు కలుపుకొనిపోయామని తెలిపారు. గత ఐదేళ్లలో ఢిల్లీలో త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించామని, వచ్చే ఐదేళ్లలో కూడా అదే తరహాలో అభివృద్ధిని కొనసాగిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.