టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల్లో కనిపించని ఉత్సాహం
బుజ్జగింపుల పర్వం షురూ
ప్రజాపక్షం/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో మునుపటి ఉత్సా హం లోపించింది. మంత్రి పదవులు ఆశించిన పలువురికి మొండిచెయ్యి చూపడం, కొందరికి కేవలం విప్ పదవులే లభించడంతో లోలోన కుతకుతలాడుతున్నారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం రాజయ్యలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. దీంతో ఇలాంటి నేతలను అధిష్ఠానం బుజ్జగింపులు పర్వానికి శ్రీకారం చుట్టింది. శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ అరికపూడి గాంధీని ప్రభుత్వ విప్‌గా నియమించగా.. ఆయన మాత్రం తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గన్‌మెన్లను కూడా వెనక్కి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. తనన కాదని ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా, అరికపూడి గాంధీని మంగళవారం ప్రగతిభవన్‌కు పిలిపించి చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంఎల్‌ఎలతో కూడా పార్టీ అధిష్ఠానం మాట్లాడినట్లు సమాచారం. గతానికి భిన్నంగా శాసనసభ లాబీల్లో మీడియాను కలిసిన నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేయగా, మరుసటి రోజైన మంగళవారం తాము అసంతృప్తి లో లేమని, పార్టీ ఏ అవకాశం, బాధ్యతలు అప్పగించిన చేస్తామని, పార్టీలోనే ఉంటామని ప్రకటించారు. కాగా సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలలో ఉత్సుకత, సమన్వయం లోపించింది. బడ్జెట్‌పై శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు స్పందించే ఆనవాయితీ ఈసారి మిస్ అయింది. గతంలో పలువురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కూడా పోటీపడి స్పందించే వారు. కానీ ఆశించిన పదవులు లభించకపోవడంతో పాటు భారీ కోతతో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో స్పందించేందుకు అధికార పార్టీ నేతలేవరూ ముందుకు రాలేదు. అయితే అసంతృప్తి వ్యక్తం చేసినవారిలో కొందరు నేతలు తా ము అసంతృప్తిగా లేమని, పార్టీ వీడడం లేదంటూ మంగళవారం స్పందించారు. ప్రధానంగా మాజీ మంత్రులు టి.రాజయ్య, జోగురామన్న,ఎంఎల్‌ఎ లు అరికపూడిగాంధీ, మైనంపల్లి హనుమంతరావు ఇలా పలువురితో అధిష్ఠానంలోని కొం దరు పెద్దలు మాట్లాడినట్లు తెలుస్తోంది. కొందరు పార్టీని వీడుతున్నారని, బిజెపిలో చేరుతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సదరు నేతలు స్పందిస్తూ తాము పార్టీని వీడబోమంటూ వివరణ ఇచ్చుకున్నారు.అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడిన అనంతరం ఆర్థిక శాఖ అధికారులతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్‌పై మాట్లాడే సాంప్రదాయం ఉండేది. అయితే సిఎం కెసిఆర్ స్వయంగా ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి లేకపోవడంతో ఆ సాంప్రదాయానికి పుల్‌స్టాప్ పడింది. ఈసారి ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పటికీ బడ్జెట్‌పై మీడియా సమావేశాన్ని నిర్వహించలేదు. కేవలం ఒకరోజు ముందే ప్రమాణస్వీకారం చేయ డం, అంతకుముందే సిద్ధమైన బడ్జెట్‌పై సమగ్ర సమాచారం లేకపోవడంతో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనట్టు సమాచారం. కాగా సాధారణంగా లాబీల్లో మంత్రు లు వచ్చినప్పుడు చుట్టూ ఎంఎల్‌ఎలతో హడావుడి కనిపించేది కానీ, ఈసారి అది లోపించింది. కొత్తగా మంత్రులైనవారితో పాటు పాత మంత్రులు కూడా ఒంటరిగానే కనిపించారు.