HomeNewsBreaking Newsఅంతా అబద్ధం

అంతా అబద్ధం

రోహిత్‌తో నాకెలాంటి సమస్య లేదు
డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొడవలు అవాస్తవం
ఇలాంటి వార్తలు ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయి
విండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు మీడియా సమావేశంలో టీమిండియా సారధి కోహ్లీ, ప్రధాన కోచ్‌ శాస్త్రీ
ముంబయి: సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మతో తనకు విభేదాలు లేవని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. అతడిని చూసి అభద్రతాభావానికి గురైతే అది తన ముఖంలో కనిపించేదని వెల్లడించాడు. తానెప్పుడూ రోహిత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతానని పేర్కొన్నాడు. ఎందుకంటే అతనంత బాగా ఆడతాడని తెలిపాడు. కాగా, ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఓడినప్పటి నుంచి రోహీత్‌కు, కోహ్లీకి పడటం లేదని, వారి మధ్య సారధ్య వివాదాలు నెకొన్నాయని, డ్రెస్సింగ్‌ రూంలో టీం సభ్యులంతా తిట్టుకున్నారని, సమాచార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా రెండు ట్రూపులుగా విడిపోయిందని.. వన్డేల, టి20 క్రికెట్‌కు రోహిత్‌ సారధ్యం వహించనున్నాడని, కోహ్లీని కేవలం టెస్టు కెప్టెన్‌గానే కొనసాగించనున్నారని వార్తలు వినిపించాయి. వారిని వారించేందకు బిసిసిఐ( భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలి) రంగంలోకి దిగిందని వార్తలు వచ్చాయి. అయితే విటన్నింటికీ టీమిండియా సారధి కోహ్లీ, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రీలు పై విధంగా వివరణ ఇచ్చారు. సోమవారం వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు.
మా ఇద్దరికీ విభేదాలా?
రోహిత్‌ నాకు ఎలాంటి విభేదాలు లేవు. బయట ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ అబద్ధాలను ఎవరు, ఎందుకు సృష్టిస్తున్నారో తెలియడం లేదు. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేమిద్దరం కలిసే పనిచేస్తున్నాం. రోహిత్‌ ఓ అద్భుతమైన ఆటగాడు. మేమిద్దరం టీమిండియా అగ్రస్థానంలో నిలిపేందకు ఎంతో కష్టపడ్డాం. నాలుగేళ్ల తర్వాత, మనం దీని గురించి మాట్లాడుతున్నాం. దీనిని మీడియా పరిశీలించి వార్తలు రాయాలి. ప్రస్తుతం క్రికెట్‌పైనే నా దృష్టి. అసలు లేని వివాదం గురించి కాదు. విభేదాల కథనాలు గందరగోళంగా ఉన్నాయి. ఇవి జట్టు ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయి. డ్రస్సింగ్‌ రూమ్‌ గురించి అబద్ధాలు, ఊహాలు సృష్టించడం అగౌరవపరచడమే. జట్టులో వాతావరణం చాలా బాగుంది. ఇంత నిలకడగా టీమిండియా ఎప్పుడూ లేదు. టెస్టుల్లో మేం ఏడో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాం. అందరం కలిసి కట్టుగానే ఇందుకు కష్టపడ్డాం.
రవిశాస్త్రీతో సంతోషమే..
రవిశాస్త్రీ మా అందరికీ మెరుగైన సలహాలు సూచనలు చేస్తుంటారు. మా అందరికీ రవి భాయ్‌తో మంచి అనుబంధం ఉంది. ఆయన మా పక్కనుంటే కచ్చితంగా సంతోషమే. ఏదేమైనప్పటికీ దీనిని సిఎసి నిర్ణయిస్తుంది. కానీ, క్రికెట్‌ సలహా సంఘం (సిఎసి) కోచ్‌ ఎంపిక గురించి ఇప్పటి వరకు నన్ను సంప్రదించలేదు. కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభను కనబరిచేందుకు వెస్టిండీస్‌తో టీ20లు మంచి వేదిక. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌, దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేశారు. ఈ ఆటగాళ్లంతా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పట్టుదల చూపించారు. వారంతా మా జట్టులో ఉండటం సంతోషంగా ఉంది. జట్టు బలంగా కనిపిస్తోంది. మెగా టోర్ని తనంతరం విశ్రాంతి తీసుకోవాలని నాకెవరూ చెప్పలేదు. జట్టును మళ్లీ ఒక బృందంగా తయారు చేయాల్సిన కీలక సమయమిది. ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరకపోవడంతో అందరం నిరాశకు గురయ్యామని తెలుసు. కానీ మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్లాలిగా..! మిడిలార్డర్‌ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వారిని విమర్శించడం సరికాదు. నిలకడగా ఆడగలిగే ఆటగాడికోసం మేం వెతుకుతున్నాం. వచ్చేఏడాది టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండటంతో దానిపై దృష్టి కేంద్రీకరించాం. అయితే టెస్టు ఛాంపియన్‌షిప్‌ వల్ల టెస్టులపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మూడు ఫార్మాట్లలో పరిస్థితులకు అనుగుణంగా రాటుదేలాలి. ఆధునిక క్రికెట్‌ స్వభావమే అది.
రహానే రానిస్తాడని..
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో అజింక్య రహానె బదులు రోహిత్‌ను ఎంచుకున్నాం. ఎందుకంటే అప్పుడు రోహిత్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ రహానే స్థిరమైన ఆటగాడు. స్లిప్‌లో క్యాచ్‌లు అందుకోవడం, బ్యాటింగ్‌ ద్వారా అతడెలాంటి ప్రభావం చూపించగలడో మేం చూశాం. అతడు మళ్లీ తిరిగి పుంజుకుంటాడు. అతనొచ్చి కచ్చితంగా భారీ స్కోర్లు చేయగలడు. అతను క్రీజులో ఉంటే అవతలి ఆటగాడికి బరోసా ఉంటుంది. అతనికి టెస్టుల్లో చాలా అనుభవం ఉంది. ఎలాంటి పిచ్‌పైనైనా రాణించగల సత్తా రహానెకు ఉంది. దీంతో మా జట్టుకు విజయావకాశాలెక్కువ.
ఐసిసి ఆలోచన ఓ అద్భుతం
ఈ ఫార్మాట్‌కు కొత్త రూపాన్ని తీసుకురానుందని, దీనికోసం తామందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వెల్లడించాడు. ఆగస్టు 1న ఆరంభమయ్యే యాషెస్‌ సమరం నుంచి ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవుతుంది. ఈ ఛాంపియన్‌ షిప్‌లో ప్రపంచ మేటీ జట్టయిన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, ఆప్ఘనిస్థాన్‌లు తలపడనున్నాయి. ఈ రెండేళ్లలో 71 మ్యాచులు, 27 సిరీస్‌లు జరుగుతాయి. చివరిగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ ఆడతాయి. ఇంగ్లాండ్‌లో 2021, జూన్‌లో ఈ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ‘క్రికెట్‌ క్రీడలో టెస్టు క్రికెట్టే అత్యున్నతమైంది. ఇది క్రికెట్‌కు అవసరం. ఆటగాళ్లలో ఎక్కువ మంది టెస్టుల్లో రాణించాలనే కోరుకుంటారు. ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌ అద్భుతమైన ముందడుగు. ప్రతి టెస్టు సిరీస్‌కు ఇదొక అర్థం చేకూరుస్తుంది. ‘ప్రతి మ్యాచ్‌ ఎంత కీలకమో ఐసిసి వన్డే ప్రపంచకప్‌ తెలియజేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ఫైనల్లో తలపడతా యి.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments