విజయాలతో రాణిస్తున్న అనుపోజు కాంతిశ్రీ, ఖ్యాతి
స్పాన్సర్‌షిప్‌ను ఆకాంక్షిస్తున్న క్రీడాకారిణులు
హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరీమణులు అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై అద్భుతంగా రాణిస్తూ తెలంగాణ క్రీడా వైభవాన్ని చాటుతున్నారు. అనుపోజు ఖ్యాతి, అనుపోజు కాంతిశ్రీ అనే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆర్టిస్టిక్ స్కేటింగ్, రోలర్స్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే పలు విజయాలు సొంతం చేసుకున్న కాంతిశ్రీ, ఖ్యాతి హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో నివాసముంటున్న అనుపోజు శ్రీధర్, చండీప్రసన్నల బిడ్డలు. అనుపోజు ఖ్యాతి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ కొరియాలోని నమవాన్‌లో జరిగిన 18వ ఏషియన్ రోలర్స్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకాన్ని చేజిక్కించుకున్నది. వివిధ దేశాలకు చెందిన స్టార్ స్కేటర్లపై ఆధిపత్యాన్ని సాధించింది. జాతీయ స్థాయిలో పలు స్వర్ణాలతో జయభేరి మోగించింది. 52, 56, 57వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సాధించగా, మూడేసి రజతాలు, కాంస్యాలతో తన సత్తా చాటింది. ఇక రాష్ట్రస్థాయిలో తనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పటికే ఏడు ఈవెంట్లలో స్వర్ణాలు గెల్చుకొన్నది. ఖ్యాతి సోదరి అనుపోజు కాంతిశ్రీ కూడా తనేమీ తక్కువకాదన్నట్లు పరిణతి చెందిన ఆటతీరుతో స్కేటింగ్ ప్రపంచాన్ని ఏలుతోంది. 54వ జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ (నొయిడా)లో పెయిర్ డ్యాన్స్‌లో స్వర్ణభేరి మోగించగా, సోలో ఫ్రీ డ్యాన్స్, సోలో ఫ్రీస్టయిల్‌లలో రజతాలు, సోలోఇన్‌లైన్స్ ఫ్రీస్టయిల్‌లో కాంస్యం సాధించింది. ఇక 14వ జాతీయ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ (హర్యానా)లో ఆమె ఐస్ డ్యాన్స్, సింక్రోనైజ్డ్ ఐస్‌స్కేటింగ్‌లలో స్వర్ణాలు, సోలో ఫిగర్ స్కేటింగ్‌లో రతజం సాధించింది. 55వ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తీవ్ర ప్రత్యర్థులను సైతం ఎదుర్కొని ద్వితీయ స్థానాన్ని సాధించి రజతం హస్తగతం చేసుకుంది. ఇక 56వ జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ (వైజాగ్)లో పెయిర్ డ్యాన్స్, క్వార్టెట్‌లలో స్వర్ణాలు, సోలో ఫ్రీస్టయిల్, సోలో డ్యాన్స్‌లలో రజతాలు గెల్చుకుంది. గత ఏడాది జరిగిన 57వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అదే ఉత్సాహాన్ని కొనసాగించి, పెయిర్‌డ్యాన్స్, ప్రీసిషన్‌లలో స్వర్ణ పతకాలు గెల్చుకోగా, పెయిర్ స్కేటింగ్‌లో కాంస్యం గెల్చుకుంది. ఇక రాష్ట్ర, జిల్లా స్థాయిలలో లెక్కలేనన్ని పతకాలతో ముంచెత్తుతోంది. అయితే ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల సాయం కోసం ఈ ఇద్దరు స్కేటింగ్ సోదరీమణులు ఎదురుచూస్తున్నారు. ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరిద్దరికి సాయం అందించే విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం వుంది. అలాగే క్రీడలను ప్రోత్సహించే సంస్థలు ఖ్యాతి, కాంతిశ్రీలకు స్పాన్సర్‌షిప్‌లను అందించేందుకు ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. స్పాన్సర్‌షిప్ అందించాల్సిందిగా వారి తల్లిదండ్రులు శ్రీధర్ (ఫోన్ ః 9246536529), చండీప్రసన్న (9908620005)లు కోరుతున్నారు.
అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై హైదరాబాదీ సిస్టర్స్
RELATED ARTICLES