రాష్ట్రంలో పెరిగిన మర్కజ్ టెన్షన్
రెండో దశ విచారణ ప్రారంభం
కాంట్రాక్ట్ వారిని గుర్తించే పనిలో మెడికల్, సర్వే బృందాలు
సెల్‌ఫోన్లు, సిగ్నల్స్ ద్వారా గుర్తింపు యత్నాలు
వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసులన్నీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివే
ప్రమాదకర పరిస్థితుల్లో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్ టెన్షన్ రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో హైరిస్క్‌లో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం కూడా దీనికి నిదర్శనం. దీంతో మర్కజ్ తీవ్రతను అరికట్టేందుకు ప్రభుత్వం ఆదివారం నుంచి రెండో దశ విచారణ ప్రారంభించిం ది. ఈ విచారణలో మెడికల్ బృందాలతో పాటు, సర్వే బృందాలు, వారికి బాసటగా పోలీసులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు రాష్ట్రంలో 1090 మంది ఉన్నట్లు గుర్తించి వారిని క్వారంటైన్‌కు, చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. వీరిని విచారించి వీరు కలిసిన వారు, వీరికి సన్నిహితం గా మెలిగిన వారు, బంధువులు, వారు తిరిగిన ప్రాంతాలు తదితర వివరాలను సేకరించారు. ఈ వివరాల ఆధారంగా రెండో దశ విచారణ ప్రారంభించారు. ఈ విచారణంలో పైన పేర్కొన్న విధం గా మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కాంట్రాక్ట్‌లను గుర్తిం చి వారికి వైద్య పరీక్షలు చేయడం, అనుమానితులను క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌కు తరలించడం చేస్తారు. కాంట్రాక్ట్ అయిన వారిలో కరోనా పాజిటివ్ ఉన్న వారు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వీరిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలించడమే రెండో దశ విచారణ ప్రధాన లక్ష్యం. వారి ప్రాంతాలు తెలిస్తే అక్కడ తనిఖీలు చేయడం లేదా సెల్‌ఫోన్లు, సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు మత పెద్దల సహకారాన్ని తీసుకుంటున్నారు. కేంద్రం ప్రకటించిన హైరిస్క్ రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, లఢఖ్, ఢిల్లీలు ఉన్నాయి. తెలంగాణనే కాదు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ తాజాగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివే కావడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో తాజాగా వెలుగుచూసిన 43 పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివే. రాష్ట్ర వ్యాప్తంగా మర్కజ్ తీవ్రతనే వెలుగుచూస్తున్నప్పటికీ అందులో ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్‌లో ఉన్నట్టుండి ఒకే రోజు 9 పాజిటివ్ కేసులు బయట పడగా వీరిలో ఒకరు రిమ్స్ వైద్యుడు ఉండడం గమనార్హం. దీంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు, చికిత్స కోసం వచ్చిన వారు, ఆయన చేసిన సర్జరీల్లో అసిస్ట్ చేసిన నర్సింగ్ సిబ్బందిలో ఆందోళన తీవ్రమైంది. ఇదే జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో ఒకే రోజు ముగ్గురికి పాజిటివ్ తేలింది. దీంతో వీరున్న గౌతమ్‌నగర్ కాలనీ, దాని చుట్టుపక్కల నివాసముంటున్న దాదాపు 150 కుటుంబాలు వారి ఇళ్లను ఖాళీ చేసి పంట పొలాల్లో షెడ్లు వేసుకుని తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకున్నారు. వీరి బాటలోనే మండలంలోని మరిన్ని గ్రామాల వారు ఉన్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లా కూడా గుబులు పుట్టిస్తోంది. ఇక్కడ తాజాగా మరో నాలుగు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వికారాబాద్‌లో నాలుగు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 93 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 272 పాజిటివ్ కేసులు ఉండగా వీరిలో 33 మంది డిశ్జార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ పరదాగేట్ ప్రాంతంలో 46 మంది ఉన్న ఒకే ఇంట్లో ఉన్న ఒకరికి పాజిటివ్ అని తేలడంతో మొత్తం కుటుంబ సభ్యులంతా ఆందోళనలో పడ్డారు. నిజామాబాద్‌లోని గౌతమ్‌నగర్ కాలనీలో ఒకే ఇంట్లో 12 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. సంగారెడ్డిలో ఆదివారం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడు నాలుగు రోజుల క్రితం మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్ రాగా, తాజాగా వారికే మరో సారి నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మర్కజ్ మూలాలు తొలిసారి బయటపడ్డ కరీంనగర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ డ్రోన్లతో నిఘా పెట్టారు. వికారాబాద్‌లో నలుగురికి పాజిటివ్ తేలగా ఇక్కడ మర్కజ్ వెళ్లి వచ్చిన 18 మందిని గుర్తించారు. జగిత్యాల జిల్లాలో మర్కజ్ వెళ్లి వచ్చిన వారి వివరాల మేరకు మూడు గ్రామాల్లో వైద్య బృందాలు రెండో దశ విచారణ నిర్వహించాయి. నిజామాబాద్‌లో ఆదివారం కరోనాతో ఒకరు మృతి చెందారు. మన రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌ను సైతం మర్కజ్ వణికిస్తోంది. తాజాగా బయటపడ్డ 34 పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారివే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎపిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 32 పాజిటివ్ కేసులు ఉండగా సాయంత్రానికి కృష్ణా జిల్లాను నెల్లూరు జిల్లా 34 పాజిటివ్ కేసులతో వెనక్కు నెట్టింది. గుంటూరు జిల్లాలో 30 పాజిటివ్ కేసులు ఉండగా, నిన్నమొన్నటి వరకు ఒకటి రెండు పాజిటివ్ కేసులే ఉన్న కర్నూల్‌లో అనూహ్యంగా ఆదివారం 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో తాజాగా 4పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గుంటూరులోని 15 కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. 450 మందిని క్వారంటైన్‌కు తరలించారు. దీనిని బట్టి ఎపిలోనూ ఢిల్లీ ప్రార్థనలు ఏ మేరకు ఉత్పాతం సృష్టిస్తున్నాయో అర్థమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం వరకు ఒక డాక్టర్‌తో సహా నలుగురు నర్సలుకు కరోనా పాజిటివ్ తేలగా ఆదివారం మరో ఇద్దరు నర్సులకు పాజిటివ్ తేలింది. రెండో దశ విచారణ సత్వరం పూర్తయి మర్కజ్ కాంట్రాక్ట్ వారిని గుర్తిస్తే తప్ప తెలంగాణ మర్కజ్ బారి నుంచి త్వరలో బయపడే అవకాశాలు ఉన్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.