హైదరాబాద్‌లో భారీ వర్షం

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలు
రాజ్‌భవన్‌ సహా లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు
ఇక్కట్లకు గురైన వాహనదారులు
రంగంలో దిగిన జిహెచ్‌ఎంసి అత్యవసర బృందాలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ; హైదరాబాద్‌ మహానగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారితో పాటు రాజ్‌భవన్‌ మార్గంలో ఎగువ నుంచి వచ్చి న వరద కారణంగా నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎర్రమంజిల్‌ రహదారిలో మురుగునీటి డ్రెయిన్‌ మూసుకపోవడంతో మోకాలిలోతు నీరు నిలిచిం ది. రాజ్‌భవన్‌ ప్రధాన మార్గంలో వరద నీరు నిలిచిపోవడంతో  చిన్నపాటి కుంటను తలపించింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జిహెచ్‌ఎంసి వర్షకాల అత్యవసర బృందాలు నీరు నిలిచిన ప్రాంతాలకు చేరుకొని, సమీపంలోని డ్రెయిన్‌లు, నాలాల్లోకి వరదలనీరు పోయేందుకు చర్యలు చేపట్టారు. బోయిన్‌పల్లిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని శ్రీసాయి కాలనీ, స్వర్ణదామనగర్‌, పి.వి ఎన్‌క్లేవ్‌ రోడ్డు, రామన్నకుంట చెరువు సమీపంలోని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. సమస్యను ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వరదనీరు తమ కాలనీలోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ప్రధాన నగరంలోని ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, ఎల్‌.బి.నగర్‌, చార్మినార్‌, కూకట్‌పల్లి జోన్‌ల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, ఆర్‌టిసి క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లి, విద్యానగర్‌, అడిక్‌మెంట్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, యూసుఫ్‌గూడ, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బేగంపేట్‌, ప్యారడైజ్‌, చిలకలగూడ, రామాంతాపూర్‌, జీడిమెట్ల, చింతల్‌, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సుచిత్ర, కొంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ప్రగతినగర్‌, శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, ఉప్పల్‌, మేడిపల్లి, బోడుప్పల్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, అబిడ్స్‌, కోఠి, బేగంబజార్‌, సైఫాబాద్‌, లకిడీకాపూల్‌, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, సుల్తాన్‌బజార్‌, నాంపల్లి, మెహిదీపట్నం, విజయ్‌నగర్‌ కాలనీ, లంగర్‌హౌస్‌, గోల్కొండ, ఎల్‌.బి.నగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రెండు, మూడు వర్షాలు కురిసే అవకాశం…
రాగల రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా 4వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?