శాస్త్రీపురం, కింగ్కాలనీ, షాహిన్‌నగర్‌లో ఎన్ఐఎ సోదాలు
రెండేళ్ల క్రితం ముగ్గురు అనుచరులను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్న తహాన్
పాక్ మహిళా ఉగ్రవాదితో సంబంధాలు
ప్రజాపక్షం/హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన తాహాన్ (32)తో పాటు మరో ముగ్గురు సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శనివారం తహాన్ నివాసముంటున్న షాహిన్నగర్తో పాటు శాస్త్రీపురం, కింగ్కాలనీలలో ఎన్ఐఎ అధికారులు ఎనిమిది గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పోలీసుల కన్నుగప్పి తప్పించుకుంటున్న ఉగ్రవాదిగా అనుమానిస్తున్న తాహాన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్ఐఎ కార్యాలయంలో వారిని విచారిస్తున్నా రు. దేశంలోని ముఖ్య నగరాలలో ఉగ్రదాడులు చేయడం, బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వారిని ఎకె-47తో హంతమొందించడం, ఇతర దేశాలలో కూడా ఉగ్రదాడులకు పథకం వేసేందుకు కుట్ర పన్నిన ఐఎస్ఐఎస్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులపై 2016లో ఢిల్లీ ఎన్ఐఎ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆర్సి -04- కేసు నమోదు చేశారు. ఆ సమయం లో తహాన్ అనుచరులైన షేక్ అజర్ ఆల్ ఇస్లాం అబ్దుల్ సత్తార్ షేక్, మొహమ్మద్ ఫర్హాన్ మహ్మద్ రఫీక్ షేక్, అద్నాన్ హుస్సేన్‌లను అదే ఏడాది జనవరి, జూన్‌లో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దేశంలోని పలు నగరాలలో ఉన్న యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం, వారికి కావాల్సిన ఆయుధాలను సరఫరా చేయడం, బాంబు పేలుళ్లుకు పాల్పడేందుకు తర్ఫీదు ఇవ్వడం, బాంబు లు తయారు చేసేందుకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయడం కోసం యత్నించామని వెల్లడించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన పలువురు యువకులను కూడా ఆకర్షించి వారిని ఐఎస్ఐఎస్ వైపు మళ్లించామని చెప్పారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఐఎస్ఐఎస్లో చేరిన 32 మంది యువకులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మందలించి వదిలిపెట్టారు.ఆ తరువాత వారిపై పోలీసులు సర్వేలెన్స్ నిఘాను పెట్టారు. వారి కదలికలపై ప్రతిరోజు దృష్టి సారించారు. ఇదిలావుండగా ఢిల్లీలో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు హైదరాబాద్‌లో తాహాన్ అనే యువకుడు నేటికి కూడా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఇటీవల సమాచారం అందించాడు. ఈ సమాచారం మేరకు ఢిల్లీ ఎన్ఐఎ అధికారులు హుటాహుటీనా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడి ఎన్ఐఎ అధికారులు, స్థానిక పోలీసుల సహాకారంతో శాస్త్రీపురం, షాహిన్‌నగర్, కింగ్ కాలనీలోని ఎనిమిది ఇండ్లను సోదా చేశారు. ఆరు గంటల పాటు వీరి సోదాలు జరిగాయి.ఈ క్రమంలోనే తాహాన్ను అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి నుంచి కంప్యూటర్‌తో పాటు హార్డ్డెస్క్ను, రెండు సెల్ఫోన్లను, పాస్‌పోర్టును ఇతర సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాహాన్ ఇరాక్, పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని, ప్రతి రోజు వారి కార్యకలాపాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని, అతని బృంద సభ్యులు రెండేళ్ల క్రితం పట్టుబడినా వారి ఆశయాలు కొనసాగించేందుకు తాహాన్ పెద్ద కుట్రకే పాల్పడినట్లు ఎన్ఐఎ అధికారులు వెల్లడించారు.పాకిస్తాన్‌కు చెందిన మహిళా ఉగ్రవాదితో తాహాన్ వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేసేవాడని తెలిసింది