హింసా ప్రవృత్తి పెరుగుతోంది!

ఒకవైపే చూస్తున్న పోలీసులు
ఖాకీలపై రాజకీయ ఒత్తిళ్లు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరోపట్టపగలు కట్టెలు కట్టినట్లు ఒక మనిషిని కొడవళ్లు, కత్తులతో నరుకుతున్న వీడియో మొత్తం సమాజం ఉలిక్కి పడేలా చేసింది. చనిపోయింది ఎవరు, ఎందుకు హత్య జరిగింది అన్నది ఒక చర్చ అయితే, హత్య చేసిన తీరు భయంకరంగా ఉంది. పదుల సంఖ్యల్లో ప్రజలు చూస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. గత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు, పెరుగుతున్న హింసా ప్రవృత్తికి అద్దం పడుతున్నా యి. జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే రెండే కారణాలు బహిర్గతమవుతున్నాయి. ఒకటి అక్ర మ సంబంధాలు, రెండు ఆస్తుల నేపథ్యం, స్థిరాస్తులకు విలువ పెరుగుతుండడంతో ఎలాగో ఒకలా ఆస్తులను పొగేసుకోవాలన్న కాంక్ష పెరిగిపోతుంది. అక్రమ మార్గంలో ఆక్రమించుకోవాలన్న ప్రయత్నంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఆస్తులు ఉన్నా అండ బలం, కండ బలం లేకపోతే ఆస్తులను రక్షించుకోవడం అంత తేలిక కాదన్న వాస్తవం క్రమేపి రుజువవుతుంది. పలు సందర్భాల్లో పోలీసుల వైఖరి వివాదస్పదమవుతుంది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించడం లేదన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. నేరానికి పాల్పడిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వారైతే కేసు నమోదు చేసేందుకు కూడా అంగీకరించడం లేదు. క్షేత్రస్థాయిలో పోలీస్‌ అధికారులు ఓ ఘటనపై ఫిర్యాదు రాగానే ఆ ఫిర్యాదులో అధికార పక్షం, ఏ వైపు ఉందో విచారణ చేసి తదనుగుణంగా స్పందించారు. ఇది పోలీస్‌ వ్యవస్థపై విమర్శ కాదు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇది. అధికార పార్టీ నాయకులతో ఘర్షణ వాతావరణం నెలకొంటే వారు చెప్పేది చేయకపోతే ఇబ్బంది అన్న భావన క్రమేపి బలపడడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో ఎన్నడులేనివిధంగా పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. తాము చెప్పిందే చేయాలన్న భావన రాజకీయ నాయకుల్లో పెరిగిపోతుండడం ప్రమాదకరంగా మారుతుంది. ఒత్తిళ్ల నడుమ నిష్పాక్షపాతంగా విచారణ జరపడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ఇటీవల కాలంలో భూ పంచాయతీలే ఎక్కువగా వస్తుండడంతో పెద్ద మొత్తంలో విలువ ఉండడంతో పలు సందర్భాల్లో ప్రతి ఫలం ఆశించడం కూడా కేసులు పక్కదారి పట్టడానికి కారణమవుతుంది. పోలీసులు న్యాయం పక్కన నిలబడకపోవడం హింసా ప్రవృత్తికి కారణమవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?