హాయి హాయిగా..!

ఆహ్లాదకరమైన వాతావరణంలో జిన్‌పింగ్‌, మోడీ భేటీ

మహాబలిపురం: తమిళనాడు పర్యటనకు వచ్చి న చైనా అధ్యక్షుడ జీ జిన్‌పింగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఘనంగా స్వాగతించారు. తమిళుల సాంప్రదాయిక వస్త్రధారణ వాస్టి(దోతీ)కట్టులో మోడీ, జిన్‌పింగ్‌తో కలియ తిరుగుతూ, తాజా కొబ్బరి నీళ్లు తాగుతూ చాలా రిలాక్సింగ్‌గా గడిపారు. సానుకూల వాతావరణంలో వారిద్దరి మధ్య అనధికార సమావేశం జరిగింది. కశ్మీర్‌ అంశంపై దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను మరిచి ఇరువురు నేతలు సానకూలంగా వ్యవహరించారు. మహాబలిపురంలో పల్లవ రాజులు నిర్మించిన వెయ్యేళ్లకుపైగా ప్రాచీన కట్టడాలు, చారిత్రక వైభవం, నిర్మాణాల విశిష్టతలను మోడీ, జిన్‌పింగ్‌కు ఓ గైడ్‌లా వివరించారు. జిన్‌పింగ్‌ వెంట వచ్చిన సిపిసి సెంట్రల్‌ కమిటీ రాజకీయ విభాగం డైరెక్టర్‌ యంగ్‌జేసి కూడా వాటిని తిలకించారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం, కృష్ణుడి వెన్నముద్ద, పంచ రథం, తీరప్రాంత ఆలయం వంటి ముఖ్య ప్రదేశాలను మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు మోడీ చూయించారు. అంతేకాకుండా మహాబలిపురం కుఢ్యాలపై ఉన్న చిత్రలేఖనాన్ని వివరించారు. ఈ ఇద్దరు ప్రధాన నేతల భేటీ సందర్భంగా గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. మహాబలిపురంలోని ఈ చారిత్రక రాతి కట్టడాలను పల్లవరాజులు ఏడో శతాబ్దిలో నిర్మించారని, చైన్నైకి సమీపంలో ఉన్న ఈ తీరప్రాంత పట్టణానికి చైనాలోని ఫుజియన్‌ ప్రాంతానికి చారిత్రక సంబంధాలున్నాయని కూడా మోడీ, జిన్‌పింగ్‌కు వివరించారు. మోడీ కి, జీ జిన్‌పింగ్‌కు సహకరించడానికి ఇరువురికి చెరో అనువాదకుడు తోడ్పడ్డారు. ఏకశిలా కట్టడమైన పంచ రథం కాంప్లెక్స్‌లో ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాలు గడిపారు. ఆ తర్వాత వారు సాంస్కృతిక కార్యక్రమాలను కలిసి తిలకించారు. దీనికి ముందు జీ జిన్‌పింగ్‌ చైన్నైకి రావడంతోనే ఆయనకు ఎర్రతివాచీ ఘనస్వాగతం లభించింది. జిన్‌పింగ్‌ను చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, చైనాలోని భారత రాయబారి విక్రం మిస్రీ పూల గుత్తులతో స్వాగతించారు. ‘వెల్‌కం టు ఇండియా, ప్రెసిడెంట్‌ జీ జిన్‌పింగ్‌’ అని మోడీ ట్వీట్‌ కూడా చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ, చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ పోలిట్‌బ్యూరో సభ్యుడు డింగ్‌ జ్యూజియాంగ్‌, స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జీచి సహా 90 మంది చైనా ప్రతినిధుల బృందం జిన్‌పింగ్‌తో చైన్నైకి వచ్చింది. విమానాశ్రయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో జిన్‌పింగ్‌కు స్వాగతంపలికారు. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ దాదాపు 6 గంటలపాటు స్వేచ్ఛగా తిరుగుతూ చర్చించుకున్నారు. తర్వాత ప్రతినిధులతో కూడా వారు చర్చించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల సమావేశం కోసం భారత్‌ వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను ఇచ్చే లక్ష్యంతో ఆయన వచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?