హాకీ ఇండియా 25 లక్షలు సాయం

కరోనాపై పోరుకు చేయూత
న్యూ ఢిల్లీ: చైనా నుంచి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదకర వైరస్‌ ప్రభావం భారత దేశంపైన కూడా బాగానే పడింది. రోజురోజుకు భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో క్రికెట్‌, బాడ్మింటన్‌, ఫుట్‌ బాల్‌, టెన్నిస్‌, అథ్లెట్లు ఒక్కొక్కరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) కూడా భాగం అయింది. మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటానికి హాకీ ఇండియా రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రధాని సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హెచ్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం అనంతరం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కఠిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలువాల్సిన అవసరం ఉందని హెచ్‌ఐ అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాఖ్‌ అహ్మద్‌ తెలిపారు. ’ఇలాంటి కష్టకాలంలో భారత ప్రభుత్వం మంచి నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ప్రధాని తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నా. క్లిష్ట సమయాల్లో సంక్షోభంపై పోరాడటానికి బాధ్యతాయుత పౌరులుగా మనమంతా ముందుకురావాలి. కరోనా కోసం రూ .25 లక్షలు ఇవ్వాలని హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. హాకీకి దేశ ప్రజల నుండి ఎంతో ప్రేమ, మద్దతు లభించాయి. వారి కోసం ఈ చిన్ని సాయం చేస్తున్నాం. బాధ్యతాయుత పౌరులుగా మనమంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాతో జరిగే యుద్ధంలో విజేతలుగా నిలుద్దాం’ అని మహ్మద్‌ ముస్తాఖ్‌ అహ్మద్‌ అన్నారు. కరోనా వైరస్‌పై పోరాడేందుకు తాను సైతం అంటూ ముందుకొచ్చాడు భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే. తన సొంత రాష్ట్రం కర్నాటకతో పాటు ప్రధాన మంత్రి సహాయక నిధికి విరాళమిస్తున్నట్లు కుంబ్లే ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అయితే ఎంత మొత్తం విరాళమిచ్చింది కుంబ్లే వెల్లడించలేదు. కరోనాపై పోరాటంలో ఇప్పటికే సచిన్‌, గంగూలీ, గంభీర్‌, రైనా, విరాట్‌, రోహిత్‌, మేరీ, బజరంగ్‌, మిథాలీ, పూనమ్‌, దీప్తి, సానియా, సింధు ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?