న్యూ ఢిల్లీ : భారత మహిళల హాకీ జట్టు డిఫెండర్, మాజీ కెప్టెన్ సునీతా లక్రా గురువారం రిటైర్మెంట్ ప్రకటించారు. మోకాలి నొప్పి కారణంగా తాను అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే ఒలింపిక్స్ జట్టుకు ఆమె దూరమయ్యారు. ఈ ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలనుకున్నానని, అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్న తరుణంలో అర్థాంతరంగా వీడ్కోలు చెప్పడం కలిచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 2008 నుంచి సునీతా లక్రా భారత మహిళల హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ‘అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నందున ఈ రోజు నాకు చాలా ఎమోషనల్ డే. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం. దీంతో అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుంటున్నాను. ఆటకు గుడ్ బై చెప్పడంతో మనసు బాధిస్తోంది‘ అని ఆమె పేర్కొన్నారు. గాయం నయమైన తర్వాత దేశవాళీ టోర్నీలు ఆడతానని పేర్కొన్నారు. దాంతో పాటు తన కెరీర్‌లో ఎదగడానికి దోహదం చేసిన నాల్కో తరఫున కూడా ఆడతానంటూ ప్రకటించారు. 2018లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించారు. అదే ఏడాది జరిగిన ఆసియా గేమ్స్‌లో లక్రా నేతృత్వంలో భారత మహిళల హాకీ జట్టు సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది. భారత్ తరుపున మొత్తం ఆమె 139 మ్యాచ్‌లు ఆడారు.
హాకీకి మాజీ కెప్టెన్ సునీత గుడ్‌బై
RELATED ARTICLES