స్తంభించిన జనజీవనం

న్యూఢిల్లీ : కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. మరోవైపు అఖిల భారత రైతు సంఘాలు గ్రామీణ భారత్‌ బంద్‌ నిర్వహించడంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు… ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. పది కేంద్ర కార్మిక సంఘాలకు వామపక్షాలు, కాంగ్రెస్‌, ఇతర బిజెపియేతర పార్టీలు మద్దతు పలకడంతో దేశం అట్టుడికింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, రవాణా సేవలపై తీవ్ర ప్రభావం పడింది. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఈ ఆందోళనకు దిగిన విషయం విదితమే. వేలాది మంది వామపక్షాల కార్యకర్తలు ఎర్రజెండాలు చేబూని రాస్తారోకోలు, రైల్‌ రోకోలు, ఇతర ఆందోళన కార్యక్రమాలకు పూనుకున్నారు. రిజర్వ్‌బ్యాంకుతోపాటు దాదాపు అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. ఫలితంగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. కోల్‌కతా, తిరువనంతపురం, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లు దారిమళ్లించడం, లేదా నిలిపివేయడం, లేదా ఆలస్యంగా నడవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ రంగంలో నడిచే బస్సులు ఎక్కువ ప్రాంతాల్లో డిపోలకే పరిమితమయ్యాయి. పశ్చిమబెంగాల్‌, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బస్సులతోపాటు టాక్సీలు, ఆటోరిక్షాలు సైతం ఆగిపోయాయి. సాయంత్రం వరకు రోడ్లు నిర్మానుష్యంగా కన్పించాయి. నిజానికి ఢిల్లీ, ముంబయిలలో ఊహించిన దానికన్నా సమ్మె ప్రభావం ఎక్కువగానే కన్పించింది. మెజారిటీ ప్రభుత్వ శాఖలు దాదాపు సెలవు ప్రకటించే పరిస్థితి చవిచూడాల్సివచ్చింది. 25 కోట్ల మంది ప్రజలు ఈ సమ్మెలో పాల్గొనడం విశేషం. విద్యుదుత్పత్తి, చమురు క్షేత్రాలు, పెట్రోల్‌ బంకుల్లో పాక్షిక బంద్‌ వాతావరణం కన్పించింది. భారత్‌బంద్‌ 2020 పేరుతో సోషల్‌మీడియాల్లోనూ మోడీ వ్యతిరేక విధానాలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో బంద్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్సులు, ఒక పోలీస్‌ వాహనం, ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పోలీసులు జులుం ప్రదర్శించారు. బాష్పవాయు గోళాలు, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించి, ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా లాఠీఛార్జికి దిగారు. పలువురు వామపక్ష కార్యకర్తలకు గాయాలయ్యాయి. బెంగాల్‌లోని మాల్దా ఏరియాలో పలు ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. ఈస్టర్న్‌ రైలేలోని సీల్దా, హౌరా డివిజన్ల మధ్య కనీసం 175 రైళ్లు రద్దయ్యాయి. కేరళలో కెఎస్‌ఆర్‌టిసి బస్సులు పూర్తిగా నడవలేదు. ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు కూడా కన్పించలేదు. అస్సాంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మారెట్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. నోబెల్‌ బహుమతి గ్రహీత మైఖేల్‌ లెవిట్‌ ప్రయాణించిన ఒక హౌస్‌బోట్‌ గంటల తరబడి నీటి ప్రవాహంలోనే నిలిచిపోయింది. ఒడిశాలో రైళ్లు, బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. తమిళనాడు, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం మధ్యాహ్నం 1 గంట వరకు తీవ్రంగా కన్పించింది. ఆ తర్వాత ప్రభావం తగ్గింది. బీహార్‌లో సిపిఐ, ఇతర వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు జరిగాయి.
కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న మోడీ విధానాలకు ఇదొక చెంపపెట్టు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం (బిపిసిఎల్‌) వంటి సంస్థల ప్రైవేటీకరణ ఆలోచనలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న కార్మిక చట్టాల సంస్కరణలను తిప్పికొట్టాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, రైల్వేలు, బీమా, బొగ్గు, రక్షణ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని పది కేంద్ర కార్మిక సంఘాలు ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశాయి. సమ్మెను విజయవంతం చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సమ్మెలో 8.5 లక్షల ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు గాను 5 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ వెంకటాచలం తెలిపారు. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగుబ్యాంకులుగా మారిస్తే, ప్రస్తుతమున్న ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పువాటిల్లడమే కాకుండా, రుణాల ఎగవేతదారులకు అది ఊతమిచ్చినట్లవుతుందని వివరించారు. నేషనల్‌ ఇన్సూరెన్స్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలకకు చెందిన క్లాస్‌ 3, 4 ఉద్యోగులు సంపూర్ణంగా ఈ సమ్మెలో పాల్గొన్నారని జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఆలిండియా అసోసియేషన్‌ నేతలు తెలిపారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల విలీనాన్ని, కార్మిక చట్టాల సవరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఎఐఐఇఎ, జిఐఇఎఐఎ నేతలు తెలిపారు. ఈ రెండు యూనియన్లకు చెందిన వంద శాతం ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడం విశేషం. ఆలిండియా రిజర్వ్‌ బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఎఐఆర్‌బిఇఎ), ఆలిండియా రిజర్వ్‌బ్యాంకు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌బిడబ్ల్యుఎఫ్‌)లు ఈ సమ్మెలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా ఆర్‌బిఐ బ్రాంచిల్లో కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, ఎఐసిసిటియు, సియుసిసి, ఎస్‌ఇడబ్ల్యు, ఎల్‌పిఎఫ్‌ తదితర పది కేంద్ర కార్మికసంఘాలతోపాటు వివిధ రంగాల్లోని స్వతంత్ర సమాఖ్యలు సైతం ఈ సమ్మెలో పాల్గొనడంతో బంద్‌ విజయవంతమైందని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ తెలిపారు. పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైల్వేలు, రక్షణ, బొగ్గు, ఫార్మా, పశుసంవర్ధక, భద్రతా సేవల్లో నూరు శాతం ఎఫ్‌డిఐలు, 44 కార్మిక చట్టాల క్రోడీకరణలకు వ్యతిరేకంగా ఈ సమ్మె సాగినట్లు కౌర్‌ వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ కనీస పింఛను రూ. 6 వేలు ఇవ్వాలని, రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, ప్రజలకు తగినంత రేషను పంపిణీ చేయాలని కూడా డిమాండ్‌ చేసినట్లు ఆమె తెలిపారు. ఎఐకెఎస్‌తోపాటు దాదాపు అన్ని రైతు సంఘాలు గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో దీని ప్రభావం వ్యవసాయ రంగంపై కూడా పడింది. ఇటీవల మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌, సిఎఎలపై కూడా ప్రజలు విరుచుకుపడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?