వరసగా 19వ రోజూ 30వేలకు దిగువన కొవిడ్ కేసులు
8 నుంచి బ్రిటన్ విమానాలకు అనుమతి
న్యూఢిల్లీ: కొత్త కరోనా స్ట్రెయిన్ భయపెడుతోంది. దేశంలో యుకె స్ట్రెయిన్ రకం కరోనా కేసుల సంఖ్య 29కి చేరుకుంది. ఈ కేసులన్నీ బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు సంబంధించినవే. దేశవ్యాప్తంగా స్ట్రెయిన్ కేసులు విస్తరించే ప్రమాదం వుండటంతో విమానాశ్రయాల్లో మరింత అప్రమత్తంగా వుండాలని అధికారులు కోరారు. కాగా, ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై భారత్ నిషేధం విధించిన విషయం తెల్సిందే. ఈ నిషేధాన్ని 7వ తేదీ వరకు పొడిగించింది. అయితే 8వ తేదీ నుంచి ఈ విమానాలకు అనుమతి వుంటుందని కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇదిలావుండగా, వరసగా 19వ రోజూ భారత్‌లో కొత్త కరోనా కేసులు 30,000 లోపు నమోదయ్యాయి. గురువారం నాడు మొత్తం 20,035 కొత్తకేసుల నిర్ధారణతో మొత్తం కొవిడ్ 19 కేసులు 1,02,86,709కి చేరుకుంది. 256 మరణాలు జతపడటంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,994కి చేరుకుంది. ఇక కోలుకున్నవారి సంఖ్య 98,83,461కు పెరిగింది. దీంతో జాతీయ రికవరీ రేటు 96.08%కి చేరుకోగా, మరణాల రేటు 1.45% ఉంది. ప్రస్తుతం కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2,54,254తో వరసగా 11వ రోజూ 3 లక్షల దిగువ నమోదైంది. అంతేకాదు గత ఏడాది జులై 6 నాడు 2,53,287 యాక్టివ్ కేసులు నమోదైన తర్వాత 179 రోజులకు ఇంత తక్కువ ఉన్నాయి. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 2.47%. దేశంలో కొవిడ్ నుంచి కోలుకున్నవాళ్లు, యాక్టివ్ కేసుల మధ్య అంతరం పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య నవంబర్ 20 నాడు కోటిని దాటింది. ఇక భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) ప్రకారం డిసెంబర్ 31 నాటికి మొత్తం 17,31,11,694 శాంపిల్స్ పరీక్షించారు. ఇక 1,48,994 మరణాల్లో 49,521తో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది.
దేశంలో కరోనా టీకా ట్రయల్ రన్ నేడే
దేశంలో శనివారంనాటి కరోనా నియంత్రణ టీకా ట్రయల్ రన్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్షవర్దన్ అధ్యక్షతన ఉన్నతస్థాయీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీకా ట్రయల్ రన్ సన్నద్ధతకు సంబంధించిన ఏర్పాట్లు, తీసుకున్న రక్షణ చర్యల గురించి చర్చించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఈ ట్రయల్ రన్లో ఎలాంటి అవాంతరాలు, సమస్యలు రాకుండా ఎలాంటి ప్రశ్నలు, సందేహాలకైనా తక్షణం సమాధానాలు చెప్పడానికి వీలుగా అనేకమంది టెలిఫోన్ ఆపరేటర్లను సంసిద్ధంగా ఉంచారు. ప్రాంతీయస్థాయిలో ఎక్కడికైనా స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడానికి వీలుగా తక్షణ ప్రతస్పందన బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల నుంచీ తరచు ఎక్కువమంది అడిగే ప్రశ్నలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ ప్రక్రియకు అనుగుణంగా తదుపరి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తగిన సన్నాహాలు చేస్తారు. పాలనాయంత్రాంగం, వైద్య అధికారుల మధ్య సమన్వయం సాధించేందుకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తారు. రక్షణ చర్యలు తీసుకోవడంపై ఇప్పటికే తగిన శిక్షణ అందరికీ ఇచ్చారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ తరహాలోనే ప్రజల సామూహిక భాగస్వామ్యం ఇందులో ఉంటుందని అందుకు తగిన విధంగా అందరినీ సన్నద్ధం చేశామనీ మంత్రి హర్షవర్దన్ చెప్పారు.