బలహీనపడ్డ రూపాయి!
మాంద్యంలో ఆర్థికవ్యవస్థ
2019లోనే అత్యధిక శాతం నిఫ్టీ,సెన్సెక్స్ పతనం
రూ. 2.6 లక్షల కోట్లు కోల్పోయిన మదుపరులు
ముంబయి: దేశీయ, అంతర్జాతీయ బలహీనతల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం 2019 సంవత్సరంలో ఎన్నడూ లేనంత అత్యధిక శాతంలో పతనమయ్యాయి. సెన్సెక్స్ 2.06 శాతం లేక 769.88 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 2.04 శాతం లేక 225.35 పాయింట్లు పడిపోయింది. తొలి త్రైమాసికంలో స్థూలజాతీయోత్పత్తి(జిడిపి) అధ్వానంగా ఉండడం.. జూన్ నెలలో ఆరేళ్ల కనిష్ఠానికి అంటే 2019 తొలి త్రైమాసికంలో 5 శాతానికి దిగిపోవడం, ఆటో రంగం విక్రయాలు మందగించడం, బ్యాంకుల విలీనం రుచించకపోవడం, అన్ని ప్రధాన రంగాల ఉత్పత్తి మందగించడం వంటి దేశీయ కారణాలు, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధానికి అవకాశాలుండడం, రూపాయి మారకంతో పోల్చినప్పుడు డాలరు విలువ రూ. 72.39 కావడం, రూపాయి విలువ 97 పైసలు పతనం కావడంతో చివరికి దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. అమెరికా, చైనా దేశాలు పరస్పర దిగుమతి వస్తువుల సుంకాలు పెంచుతామని ఆదివారం ప్రకటించడంతో ఆసియాలోని షాంఘై, హాంకాంగ్, కొరియా, జపాన్ స్టాక్ మార్కెట్లు కూడా మిశ్రమంగా స్పందించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ఇంట్రాడేలో 1.07 శాతం పతనమై బ్యారెల్ 58.03 వద్ద ట్రేడయింది. మదుపరుల సంపద రూ. 2.6 లక్షల కోట్లు కరిగిపోవడంతో భయంపట్టుకున్న మదుపరులు భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ అప్రతిహతంగా కొనసాగింది. ఆరంభం నుంచి బలహీనంగా ఉన్న సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత పతనమయ్యాయి. ఒక దశలో 852 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ చివరికి 769.88 నష్టంతో 36652.91 వద్ద, నిఫ్టీ 225.35 పాయింట్లు పతనమై 10797.90వద్ద స్థిరపడ్డాయి. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలు ఢమాల్ అన్నాయి. రూపాయి విలువ పతనంతో రెండు ఐటీ స్టాకులు…టెక్ మహీంద్ర, హెచ్‌సిఎల్ టెక్ మాత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత, హెచ్‌డిఎఫ్‌సి, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్, ఒఎన్‌జిసి దాదాపు 4.45 శాతం వరకు పతనమయ్యాయి. లోహ, విద్యుత్తు, కన్జూమర్ డ్యూరబుల్స్, టెలికాం, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, కేపిటల్ గూడ్స్ వంటి అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో గృహ వస్తువుల వినియోగం బలహీనంగా ఉండడం, నిరుద్యోగం, డబ్బు లభించకపోవడం వంటి దేశీయ కారణాలు కూడా మార్కెట్ల పతనాన్ని శాసించాయి. 10 ప్రభుత్వ బ్యాంకుల విలీనం రుచించకపోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా పడిపోయాయి. ఆర్థికవ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ మాత్రం దెబ్బతింది. ఆటో రంగం అమ్మకాలు ఆగస్టులో రెండంకెల మేరకు పతనం అయ్యాయి. ఆటోరంగం చరిత్రలోనే ఎన్నడూ లేనంత పతనం కనిపిస్తోంది. దీనికితోడు దేశంలో తయారీ రంగం కార్యకలాపాలు ఆగస్టు నెలలో 15 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ఎనిమిది ప్రధాన పరిశ్రమల వృద్ధి జులైలో 2.1 శాతం పడిపోయింది. దీనికి కారణం బొగ్గు, ముడి చమురు, సహజవాయువు ఉత్పత్తులు కుదింపుకు లోనవ్వడం కారణమని తెలుస్తోంది.
స్టాక్ మార్కెట్లు ఢమాల్
RELATED ARTICLES