HomeNewsBreaking Newsసొంత సిద్ధాంతాల్లేవ్‌

సొంత సిద్ధాంతాల్లేవ్‌

రైతుల మంచికే సంస్కరణలు
అందరి వాదనలూ వింటాం
ఇప్పుడు కాకపోతే మరో 50 ఏళ్లు ఆగాలి
సుప్రీం నియమించిన ప్యానెల్‌ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో “ప్రభుత్వ అనుకూలురు” అని నిరసన చేస్తు న్న రైతు సంఘాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపే సమయంలో తమ సొంత సిద్ధాంతాలు, అభిప్రాయాలను పక్కన పెడతామని సంక్షోభ పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ మంగళవారం స్పష్టం చేసింది. ఇంకా వ్యవసాయ సంస్కరణలు అత్యవసరమైన సమయంలో చట్టాలు విరమించుకోవడం మం చిదికాదని సూచించింది. వ్యవసాయ సంస్కరణలు ఎంతో అవసరమని, ఒకవేళ వీటిని విరమించుకుంటే వచ్చే 50 ఏళ్లలో మరే రాజకీయ పార్టీ ఈ దిశగా మళ్లీ ప్రయత్నించదని కమిటీలో సభ్యుడు, మహారాష్ట్ర షేట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్‌ ఘన్వట్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే చట్టాలకు మద్దతిస్తున్న, వ్యతిరేకిస్తున్న రైతులందరి వాదనలు తమ కమిటీ వింటుందని, ఆ తర్వాత సుప్రీం కోర్టుకు నివేదిక అందిస్తుందని తెలిపారు. గత 70 ఏళ్లలో అమలు చేసిన చట్టాలు రైతు ప్రయోజనాలను నెరవేర్చలేదని, 4,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు అనిల్‌ ఘన్వట్‌. “రైతులు పేదరికంలో కూరుకుపోతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులు వస్తూండగానే ఆందోళన మొదలైంది” అన్నారు ఘన్వట్‌.
ప్రత్యక్షంగా.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదింపులు  సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటుచేసిన కమిటీ తొలి సమావేశం మంగళవారం ముగిసింది. రైతులు, ఇతర వర్గాలతో సంప్రదింపులు జనవరి 21 గురువారం నాడు 11 గంటలకు జరుగుతాయని ఘన్వట్‌ తెలిపారు. సంప్రదింపులు ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెండు విధాలుగా ఉంటాయని ఆయన అన్నారు. కొత్త చట్టాలపై రైతు సంఘాలతోపాటు పంటల ఎగుమతిదారులు, వ్యాపారులు, మిల్లర్లు, జిన్నర్లు, పాడి, కోళ్ల పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను కూడా ప్యానెల్‌ తెలుసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని, సలహాల కోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ఘన్వట్‌ తెలిపారు. కానీ, రైతులను ప్యానెల్‌ ముందుకు రప్పించేందుకు ఒప్పించడమే “అతిపెద్ద సవాలు” అన్నారు ఘన్వట్‌. అయితే తమవంతు ప్రయత్నం తాము చేస్తామని, రైతులతో తప్పకుండా మాట్లాడతామని ధీమా వ్యక్తం చేశారు. తొలి సమావేశంలో కమిటీలో ఇతర సభ్యులైన వ్యవసాయ ఆర్థికవేత్తలు అశోక్‌ గులాటీ, ప్రమోద్‌ కుమార్‌ జోశీ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిండానికి ఈ నెల 12న సుప్రీం కోర్టు నలుగురు సభ్యుల ప్యానెల్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో సభ్యుడైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకొన్నారు.
ఏకపక్షంగా ఉండలేం
తమ ముందుకు రైతులు రాకపోతే, తాము నిరసన స్థలాల్లో వారితో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సమావేశం కావొచ్చా అన్నది స్పష్టంగా తెలియదని, అయితే రైతులను కలిసి, వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తామని ఘన్వట్‌ అన్నారు. ఇక ప్యానెల్‌ సభ్యులందూ “ప్రభుత్వ అనుకూలురు” అని రైతులు ఆరోపిస్తున్నారని, సభ్యులు ఇప్పటికే చట్టాలకు మద్దతు తెలిపారని అన్నప్పుడు, “ఇది వాళ్ల అభిప్రాయం. ఇంతకుముందు మా సిద్ధాంతం ఏదైనా ఉన్నప్పటికీ, ఇప్పుడు మేము సుప్రీం కోర్టు నియమించిన కమిటీలో సభ్యులం. మేము ఏకపక్షంగా ఉండలేం” అని వ్యాఖ్యానించారు అనిల్‌ ఘన్వట్‌. ఇక ప్యానెల్‌ నుంచి తప్పుకొన్న మాన్‌ స్థానంలో ఎవరినైనా నియమిస్తారా లేదా అన్నది సుప్రీం కోర్టు ఇష్టమని ఘన్వట్‌ అన్నారు.
మరో సభ్యుడు గులాటీ… ప్యానెల్‌లో సభ్యులందరూ “సమానమే”, దీనికి అధ్యక్షుడిని నియమించాలన్న అభిప్రాయానికి తావేలేదని స్పష్టంచేశారు. చట్టాలపై రైతులు, ఇతరుల అభిప్రాయాలను తెలుసుకొని, సుప్రీం కోర్టుకు అందజేయడమే తమ ప్రధాన కర్తవ్యం అన్నారు. అభిప్రాయాలు ఏవైనా కానీ, కోర్టు బాధ్యతను అప్పగించినందువల్ల పక్షపాతం లేకుండా, పారదర్శకంగా పనిచేయాల్సి ఉంటుందని మరో సభ్యుడు జోశీ అభిప్రాయపడ్డారు. ఇందులో సొంత అభిప్రాయాలకు చోటుండదని ఆయన స్పష్టం చేశారు. నివేదికను రెండు నెలల్లో సుప్రీం కోర్టుకు అందజేస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు జోశీ.
రైతు సంతోషంతోనే శాంతి
రైతులు చలిలో చనిపోతున్నారు. అందుకే సుదీర్ఘంగా సాగుతున్న ఆందోళనకు సాధ్యమైనంత తొందరగా ముగింపు పలకడాన్నే ప్యానెల్‌ కోరుకుంటోందని అనిల్‌ ఘన్వట్‌ అన్నారు. ఇంకా తమ సంస్థ షేట్కారీ సంఘటన్‌ కూడా చట్టాలకు పూర్తి అనుకూలం ఏమీ కాదని, కొన్ని సవరణలు కోరుతోందని వెల్లడించారు. ఒకవేళ వీటిని విరమించుకుంటే వచ్చే 50 ఏళ్లలో మరే రాజకీయ పార్టీ ఈ దిశగా మళ్లీ ప్రయత్నించదు. రైతులు మరణిస్తూనే ఉంటారు. మార్పు కోరుకుంటే చర్చలకు రండి. మీరు కోరుకున్నవి తీర్చేందుకు మేము ప్రయత్నిస్తాం అని ఘన్వట్‌ హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో దోపిడీ వ్యవస్థ అంతమయ్యేందుకు సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు. అందుకని “మనందరం ఒక్కటే, సంస్కరణల కోసం కమిటీతో సహకరించండి. నేను కూడా రైతు నాయకుణ్నే. పంజాబ్‌ రైతులకు సహకరించేందుకు మహారాష్ట్ర నుంచి రైతులను పంపించాను. మనమధ్య శత్రుత్వం లేదు. మాకు ఒక సిద్ధాంతం ఉండేది. అదిప్పుడు లేదు” అన్నారు ఘన్వట్‌. రైతులు సంతోషంగా జీవించకపోతే దేశంలో శాంతి ఉండదని ఘన్వట్‌ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం, ఆందోళన చేస్తున్న రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 విడతలుగా చర్చలు జరిగాయి. అయితే అవి ఎలాంటి స్పష్టమైన పరిష్కారాన్ని ఇవ్వలేకపోయాయి. పదో విడత చర్చలు బుధవారం (నేడు) జరగనున్నాయి. 2020 సెప్టెంబర్‌లో అమలులోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు 55 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు కనీస మద్దతు ధర, మండీ వ్యవస్థకు గండికొట్టి, తమను బడా కార్పొరేట్ల దయకు వదిలేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల భయాలు అర్థ రహితం అని, చట్టాలను విరమించుకోలేమని ప్రభుత్వం తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments