HomeNewsBreaking Newsసొంత పొలాల్లోనే కూలీలుగా రైతులు

సొంత పొలాల్లోనే కూలీలుగా రైతులు

కేంద్రం మాటలు వింటే ముప్పు తప్పదు
విద్యుత్‌ సవరణ చట్టం వెనుక భయంకరమైన కుట్ర
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యాఖ్య
ప్రజాపక్షం / హైదరాబాద్‌
విద్యుత్‌ సవరణ చట్టం వెనుక వందకు వంద శాతం భయంకరమైన కుట్ర దాగి ఉన్నదని, దేశంలో నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా, తదుపరి ప్రభుత్వాల ద్వారా నిర్మించిన విద్యుత్‌ సంస్థలకు రూ.లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, వాటిని అగ్గువకే ‘అడ్డికి పావు సేరు’ లెక్కన ప్రైవేటుకు, షావుకారులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నా రు. ప్రభుత్వ రంగ సంస్థలను, ఎయిర్‌పోర్టు, నౌకాశ్రయాలను, ఎల్‌ఐసి, రైల్వేలు సహా అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని విమర్శించారు. వ్యవసాయం, విద్యుత్‌ రంగాలు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటి ని కూడా షావుకారులకు అప్పజెప్పే వరకు నిద్రపోయేది లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు చేస్తున్నారని, కేంద్రం మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారతారన్నారు. దీనికి సంస్కరణలు అనే అందమైన పెట్టారని అన్నారు. ఏడాది, ఏడాదిన్నరలో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తయితే తెలంగాణ ప్రజలకు విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయని ప్రకటించారు. “కేంద్ర విద్యుత్‌ బిల్లు పర్యవసనాలపై” శాసనసభలో సోమవారం నాడు జరిగిన లఘు చర్చకు సిఎం కెసిఆర్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ళలో ఈ ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేయలేదని, అప్రజాస్వామికంగా, కిరాతకంగా, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ 11 రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిందని, సిగ్గుండాలని మండిపడ్డారు. మరో 17- నెలల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు నూటికి నూరు
శాతం సాగనంపుతారని ధీమా వ్యక్తం చేశారు. రైతుల పాలిట శాపంగా మారిన మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తాను చెప్పిన విద్యుత్‌ లెక్కలు అబద్ధమైతే క్షణంలో రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. బిజెపి సభ్యులు రఘునందన్‌ చర్చ సందర్భంగా కేంద్ర విద్యుత్‌ బిల్లులో ఎక్కడా మీటర్‌ పెట్టాలని అనలేదని చెప్పిన మాట తప్పు అని, మీటర్‌ పెట్టకుండా విద్యుత్‌ కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నదన్నారు.విద్యుత్‌ ఉన్నా వాడుకోలేని తెలివిలేని ప్రభుత్వం దేశంలో కావాల్సినంత విద్యుచ్ఛక్తి ఉన్నప్పటికీ వినియోగించుకోలేని తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం ఉండడం మన ఖర్మ అని సిఎం కెసిఆర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 4.04 లక్షల మెగావాట్లు అని, అందులో బేస్‌లోడ్‌ (ఉత్పత్తి అవుతున్నది) 2.42 లక్షల మెగావాట్లు అని, ఇప్పటి వరకు పీక్‌లోడ్‌ (అత్యధికంగా వినియోగించినది) 2.10 లక్షల మెగావాట్లు మాత్రమేనని వివరించారు. అదనంగా 1.20 లక్షల మెగావాట్ల సామర్థ్యం ఉన్నదని, పొరుగుదేశాలతో డిప్లొమాటిక్‌ సమస్యలను పరిష్కరించుకుంటే కోసి, గండ్కీ నదులపై జల విద్యత్‌ కేంద్రాలు స్థాపిస్తే వేల కోట్ల మెగావాట్ల విద్యుత్‌ లభిస్తుందన్నారు. స్థాపిత విద్యుత్‌ కేంద్రాలలో 99 శాతం కాంగ్రెస్‌, యుపిఎ హాయంలోనే ఏర్పాటయ్యాయని, ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదన్నారు. వీళ్ళ షావుకారు(అదానీ) కొత్తగా 50- మెగావాట్ల సౌర విద్యుత్‌ తయారు చేస్తున్నారని, దానిని కొనుగోలు చేయించేందుకే విద్యుత్‌ సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు. మీరు కమిషన్‌లు తీసుకొని షావుకార్లుకు ఇచ్చిన రూ.12 లక్షల కోట్ల ఎన్‌పిఎలు ఉద్దీపన కాదని, తాము రైతుబంధు, రైతుబీమా పేరుతో తెలంగాణ రైతులకు ఇచ్చేదే అసలైన ఉద్దీపన అని తెలిపారు. తమ విధానాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రం మొత్తం కలిపినా లేని విధంగా ఈ సారి కేవలం వానాకాలంలోనే 65 లక్షల ఎకరాలకు వరినాట్లు పడ్డాయన్నారు.
రూ.4 వేల సింగరేణి బొగ్గు కాదని… రూ.30వేల విదేశీ బొగ్గు కొనాలా?
జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగం 957 యూనిట్లయితే, తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 1,250 యూనిట్లు అని వివరించారు. చిన్నదేశాల కంటే మనదేశంలోనే విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉన్నదన్నారు. విద్యుదుత్పత్తిలో బిజెపి ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్మాల్‌ గోవిందం మాటలేనని అన్నారు. సౌరశక్తి పేరుతో విద్యుత్‌ వ్యవస్థను బడాబాబులకు అప్పగించేదుకు చర్యలు చేపడుతున్నారన్నారు. చెత్తను వాడుకుని కూడా అద్భుతంగా విద్యుత్‌ తయారు చేయవచ్చని, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తయితే మనకూ విద్యుత్‌ చౌకగా లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిగా 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని విశ్వగురు(ప్రధాని) చెబుతున్నారని, సింగరేణిలో రూ.4వేలకు లభించే బొగ్గును వదిలి, విదేశాల నుండి రూ.30వేలకు బొగ్గును కొనాలా? అని సిఎం ప్రశ్నించారు. ఆ బొగ్గు కూడా వారి షావుకారు (అదానీ) మిత్రులు తీసుకున్న ఆస్ట్రేలియా గనుల నుండే వస్తాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్‌ విధానంతో అంధకారంలోకి వెళ్తున్నామన్నారు. విద్యుత్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఇఆర్‌సి రుణాలు ఆపే కుట్ర
కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపైన పడ్డారని, రాష్ట్రానికి రావాల్సిన ఇఆర్‌సి రుణాలు ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని సిఎం విమర్శించారు. ఉదయ్‌ పథకంలో చేరిన తర్వాత అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తెలంగాణ పోరాటాలు, పౌరుషాల గడ్డ అని, ఇక్కడ పిట్ట బెదిరింపులు పనిచేయబోవని, విద్యుత్‌ విషయంలో కేంద్రం బండారం బయటపెడతామని హెచ్చరించారు. పింఛన్లు, రైతుబంధు గురించి కేంద్రమంత్రికి ఎందుకని, శీతాకాల సమావేశాలు 20 రోజులు జరిపి కేంద్రాన్ని ఎండగడతామని చెప్పారు.
బకాయిలు ఇప్పించండి
ఎపికి చెల్లించాల్సిన బకాయిలను నెల రోజుల్లో చెల్లించాలని చెబుతున్న కేంద్రం, అదే ఎపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను కూడా కేంద్రమే ఇపిపంచాలని సిఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.3వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు,మరో రూ.3వేల కోట్ల వడ్డీని తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని కేంద్రం చెప్పిందని, ఈ బాకాయిలను నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సిఎం అన్నారు. మరి ఎపి నుంచి తెలంగాణకు రూ.17వేల కోట్లు రావాలని, కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉన్నదని, తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6వేల కోట్లను మినహాయించుకుని మిగతా మొత్తాన్ని కేంద్రమే ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. పునర్విభజన హామీల అమలలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని కెసిఆర్‌ ధ్వజమెత్తారు. మొదటి కేబినెట్‌లోనే కేంద్రం తెలంగాణ గొంతు నులిమేసేలా 460 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టు సీలేరును ఆంధ్రాకు కేటాయించిందని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ మొదటి మీటింగ్‌లోనే నాటి ఎపి సిఎం చేతులో కీలుబొమ్మగా మారి, ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని, వాస్తవానికి ఆర్డినెన్స్‌ తేవాల్సిన పరిస్థితి కాదని, శాసనసభలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రెఫర్‌ చేయకుండా కర్కషంగా ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వేరు చేశారని మండిపడ్డారు.
మోస్ట్‌ ఫాసిస్ట్‌ పిఎం మోడీ
ఈ దేశంలో నరేంద్ర మోడీని అత్యంత ఫాసిస్టు ప్రధానమంత్రి అని విమర్శించిన మొదటి వ్యక్తిని తానేనని సిఎం కెసిఆర్‌ గుర్తు చేశారు. అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తోందని, అధికారం అనేది బాధ్యత అని ఇది రాచరికం కాదని, బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలని అన్నారు. రాజ్యాంగంలో కేంద్రం పరిధిలో, రాష్ట్రాల పరిధిలో ఉండాలని, ఇద్దరూ కలిసి సంప్రదించుకుని, కొన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారని వివరించారు. విదుత్య్‌ ఉమ్మడి జాబితాలో ఉన్నదని, దీనిపై కేంద్రం పెత్తనం లేదన్నారు. అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బిజెపికి ఎప్పుడూ 50 శాతం ఓట్లు కూడా రాలేదని, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారని, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం ఒక్క మంచిపనినైనా చేసిందా అని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏమిటో చెబుతారని, యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా? అని అన్నారు. తెలంగాణలో 3 తోకలున్నాయని, వారు తమను పడగొడతామని అంటున్నారన్నారు. ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడిందని, రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ దేశంలో ఒక పార్టీనే ఉంటదని డిక్లేర్‌ చేయండి, మంచిదే కదా?, బ్యాన్‌ చేయండి … ‘మీ సంగతో,మా సంగతో’ తేలుతుందని సిఎం కెసిఆర్‌ అన్నారు. దేశంలో వేరే పార్టీలను ఏవీ ఉంచబోమని, ఉండకుండా చేస్తామని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నారని, కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. దీనిపై పలు ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి, కేంద్ర హోం మంత్రి ఏం మాట్లాడుతున్నరని ప్రశ్నించారని, కేంద్ర హోంమంత్రి నోటి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాటను ఈ దేశం భరించవచ్చునా? ఇది ధర్మమేనా.. భారతదేశాన్ని నడిపించే పెద్దలు మాట్లాడే మాటలేనా? అని ప్రశ్నించారు. అహింసతో దేశాన్ని తీసుకువచ్చిన మహత్ముడు పుట్టిన నేల ఇది అని, ఎవరికి కిరీటం పెట్టడానికి? ఎవరిని కాపాడడానికి ఈ అరుపులు, పెడబొబ్బలు. ఈ పార్టీకి (బిజెపికి) రెండుసార్లు 50 శాతం ఓట్లు రాలేవని అన్నారు.
ఆర్‌టిసిని అమ్మేయాలని కేంద్రం లేఖ
ఆర్‌టిసిని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాస్తోందని సిఎం అన్నారు. ఆర్‌టిసిని అమ్మేయండి అని లెటర్లు మీద లెటర్లు వస్తున్నాయని చెప్పిన సిఎం.. ఆ ఉత్తరాన్ని సభలో చూపించారు. “ఎవరు ముందుగ అమ్మితే వారికి రూ. వెయ్యి కోట్ల బహుమానం అంటున్నారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్‌టిసిని అమ్మాలని లెటర్లు పంపాలని ఆర్థికమంత్రి పంపారు. మొత్తం మీద సబ్జెక్ట్‌ ఏంటంటే.. మేం కూడా అమ్ముతున్నం కాబట్టి.. మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నరు’ అని కెసిఆర్‌ ధ్వజమెత్తారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments