సుప్రీంకోర్టుకు ఎన్‌కౌంటర్‌

రేపు ‘పిల్‌’ను పరిశీలించనున్న అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ: తెలంగాణలో ఇటీవల మహిళా వెటర్నీ డాక్టర్‌పై హత్యాచారం చేసి, అరెస్టయిన నలుగురు నిందితులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌ కావడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)ను సుప్రీంకోర్టు విచారించాలా,వద్దా అనేది బుధవారం పరిశీలించనుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ, అలాగే కోర్టు వెంటనే విచారించాలని కోరుతూ న్యాయవాది జిఎస్‌ మణి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి పిల్‌ను దాఖలుచేశారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను మాజీ సుప్రీంకోర్టు జడ్జిల ద్వారా పర్యవేక్షించాలని మరో న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఇంకో ప్రజాప్రయోజన వ్యా జ్యం (పిల్‌)ను దాఖలు చేశారు. న్యాయవాదులు జిఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌లో వారు ఆరోపిత ఎన్‌కౌంటర్‌ ‘బూటకం’ అని, ఆ ఘటనలో పాల్గొన్న పోలీసు అధికారులపై ప్రాథమిక సామచార నివేదిక(ఎఫ్‌ఐఆర్‌) దాఖలు చేయాలని కోరారు. ఎదురుకాల్పుల్లో ఆ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారని తెలంగాణ పోలీసులు శుక్రవారం చెప్పారు. దర్యాప్తులో భాగంగా నేరానికి సంబంధించిన ‘రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ సీన్‌’ కోసం హత్యాచారం జరిగిన ఘటనాస్థలికి నిందితులను ఉదయం 6.30 గంటలకు తీసుకెళ్లినప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్‌ను నిందితులు తగలబెట్టిన ఎన్‌హెచ్‌ వద్దే నలుగురు నిందితులు కూడా కాల్చివేతలకు గురయ్యారు. అమాయక మహిళలపై హత్యాచారం జరిపే నిందితులను ఎవరూ సమర్థించబోరని మణి, యాదవ్‌ తన పిల్‌లో పేర్కొన్నారు. ‘అయితే దర్యాప్తు సంస్థ లేక పోలీసు కమిషనర్‌ స్థాయి అధికారులైనా సరే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని బూటకపు ఎన్‌కౌంటర్‌ కింద నిందితులను చంపకూడదు…శిక్షించేందుకు కోర్టు ముందుకు వారిని విచారణకు తీసుకురాకుండానే చంపేయడం దురదృష్టకరం’ అని వారు తమ పిల్‌లో తెలిపారు. ‘న్యాయ విచారణ జరపకుండానే నిందితులను శిక్షించే హక్కు పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు లేదు. విచారణ జరిపి శిక్షించే హక్కు కేవలం కోర్టుకు మాత్రమే ఉంది. స్వతంత్రంగా, నిష్పక్షపాతం విచారించే హక్కు కేవలం కోర్టుకు మాత్రమే ఉంది. కోర్టు విచారణ చేశాక కారగార శిక్ష లేక మరణ శిక్ష విధించొచ్చు’ అని మణి, యాదవ్‌ తమ పిల్‌లో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?