HomeNewsLatest Newsసుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

నలుగురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌ వాల్‌ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. సుంకిశాల ప్రాజెక్టు డైరక్టర్‌ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. ఈ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్‌ సర్కిల్‌ – 3 (సుంకిశాల)లో పని చేస్తున్న సిజిఎం ఎస్‌. కిరణ్‌ కుమార్‌ , జి.ఎం. బి. మరియరాజ్‌, డిజిఎం ఎన్‌. ప్రశాంత్‌,
మేనేజర్‌ కె.వి.పి. హరీష్‌లను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం. దాన కిషోర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుంకిశాల ప్రమాదం జరిగిన తర్వాత జలమండలి అంతర్గతంగా కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ కమిటీ తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే, ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి అకస్మాత్తుగా బ్యాక్‌ క్లోజ్‌ వేవ్‌ యాక్షన్‌ పెరిగి నీళ్లు టన్నెల్లోకి వచ్చాయి. దీంతో టన్నెల్‌ గేటు ధ్వంసమైంది. దానికి అనుసంధానంగా ఉన్న సైడ్‌ వాల్‌ ఆగస్టు 2 వ తేదీన కూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 510 అడుగులకన్నా తగ్గితే హైదరాబాద్‌కు నీటి తరలింపు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో డెడ్‌ స్టోరేజీ నుంచి కూడా నీరు తలించేందుకు వీలుగా నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం పాల్తితండాలో సుంకిశాల గట్టు వద్ద పంప్‌హౌస్‌ నిర్మాణానికి గత ప్రభుత్వం హయంలో జలమండలి పనులు ప్రారంభించింది. 2021 మార్చి 16న ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు పనులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో పనులు కేటాయించగా, అక్టోబర్‌ 2022లో వ్యయాన్ని రూ.2,214 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. లోతుల్లో నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్‌హౌస్‌ నుంచి మూడు సొరంగాలు నిర్మిస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంలో 455 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి సొరంగాన్ని, 504 అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండవది, 547 అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. అయితే పంప్‌హౌస్‌, కృష్ణానది మధ్య కేవలం 192 మీటర్లు మాత్రమే దూరం ఉంది. వరద వచ్చిన సమయంలో ఆ ఉధృతి తాకిడి పంప్‌హౌస్‌లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు. వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టన్నెల్‌ పనులు పూర్తిచేసే క్రమంలో సంపువైపు టన్నెల్‌ ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్‌ వైపు ఉన్న మట్టిని తొలగించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికికానీ మధ్య టన్నెల్‌ స్థాయి వరకు వరద రాదని భావించారు. దానికి భిన్నంగా దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో సాగర్‌ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి, ఈనెల 2న ఉదయం టన్నెల్‌లోకి భారీ వరద చేరింది. దీంతో వాల్‌ కూలిపోయింది. అయితే ఇన్‌ టెక్‌ వెల్‌ పనులు ఇప్పటి వరకు 60 శాతం, పంపింగ్‌ మెయిన్‌ పనులు 70 శాతం, ఎలక్ట్రో మెకానికల్‌ పనులు 40 శాతం పూర్తయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments