రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు : స్తంభించిన జనజీవనం
వేలాది గ్రామాలకు రాకపోకలు బంద్
జగిత్యాల జిల్లాలో వరదలో చిక్కుకుని తండ్రీకొడుకు గల్లంతు
ప్రజాపక్షం న్యూస్ నెట్‌వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుం డా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలు, కాలనీలకు, రోడ్లపైకి వరదనీరు చేరి జనజీవనం స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఎటు చూసినా వర్షపు నీరే కనబడింది. వరద నీటితో అనేక ప్రాంతాల్లో రోడ్లు వాగులు, నదులను తలపించాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. భారీ వర్షం, వరద నీటికి సిరిసిల్ల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కరీంనగర్ నగరంలో ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది.. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాత బస్టాండ్, వెంకంపేట, ప్రగతినగర్, పెద్దబజార్, కరీంనగర్ రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పట్టణంలో అమ్మకాల కోసం ఉంచిన పలు వినాయక విగ్రహాలు వరదలో కొట్టుకెళ్లాయి. వరదనీటిలో కొట్టుకొచ్చిన ఓ వ్యక్తిని స్థానికులు బయటకు తీశారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు సిరిసిల్ల సమీపంలో ఉన్న బోనాల చెరువు ప్రమాదకరంగా మారింది. ఏ సమయంలోనైనా చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సిరిసిల్లలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతూ రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం జంపన్నవాగు బ్రిడ్జి మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్లోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెద్దాపూర్ కెటికె 3 ఓసిపిలో వెయ్యి టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. గణపురం మండలం వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి మధ్య మోరంచవాగు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో పంతిని వద్ద నీటి ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. ఉప్పరపల్లి చెరువు ఉప్పొంగడంతో అటుగా వెళ్లే రోడ్డు పూర్తిగా వరదముంపులో ఉండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.ఆదివారం రాత్రి నుండి మంగళవారం వరకు కరీంనగర్, కరీంనగర్ రూరల్ తో పాటు, మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, చొప్పదండి, కొత్తపల్లి, గంగాధర, రామడుగుతో పాటు పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. లోతట్టు ప్రాంతాలు కుంటలు, చెరువులు నిండి పొంగిపొర్లాయి. పలు మండలాలో పంటపొలాలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిండుకుండలా డ్యామ్‌లు నిండి పొంగిపొర్లుతున్నాయి, కరీంనగర్ మానేరు డ్యామ్ 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం-బాన్సువాడ మధ్యలో రాంపూర్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మద్నూర్ మండలం గోజెగావ్‌లోని లెండి వాగుకు భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. డోంగ్లి- మాధన్ హిప్పర్గ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు వరదనీరు చేరుకోవడంతో రాకపోకలకు ఆగిపోయాయి. భారీ వర్షం ప్రభావంతో జమ్మికుంట నుంచి కోరపల్లికి వెళ్లేదారిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
జగిత్యాల జిల్లాలో వరదలో చిక్కుకొని తండ్రీ కుమారుడు గల్లంతు
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలతో గొల్లపల్లి మండలం మల్లన్నపేట వాగులో చిక్కుకొని నందిపల్లికి చెందిన తండ్రీకుమారుడు గల్లంతయ్యారు. వంతెనపై నుంచి వాగు దాటుతుండగా వరద ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టగా.. బాలుడు విష్ణు మృతదేహం లభ్యమైంది. చిన్నారి తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
’బొగత’ పరవళ్లు
ఎగువ ప్రాంతాలతో పాటు ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాజేడు మండలంలోని చీకులపల్లి వాగుకు నీటి ప్రవాహం పోటెత్తింది. దీంతో బొగత జలపాతం వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీటి తుంపరలు, జల సవ్వడితో అటవీ ప్రాంతం మనోహరంగా దర్శనమిస్తోంది. భారీ వర్షాల వల్ల కొనసాగుతున్న వరదతో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొత్త అందాలతో చూపరులను కనువిందు చేస్తోంది.
పరీక్షలు వాయిదా వేసిన శాతవాహన వర్సిటీ
రాష్ట్రవాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శాతవాహన వర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.
సిరిసిల్ల, వరంగల్‌లో జలదిగ్బంధం
RELATED ARTICLES