సిపిఐ మాజీ ఎంఎల్‌ఎషేక్‌ నాసర్‌వలి కన్నుమూత

ప్రజాపక్షం/విజయవాడ : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకు లు, మాజీ ఎంఎల్‌ఎ షేక్‌ నాసర్‌ వలి(83) మంగళవారం ఉదయం తన నివాసంలో మృతిచెందారు. విజయవాడ కృష్ణలంక పరిధిలోని రాణిగారితోటకు చెందిన నాసర్‌వలి వయోభారం కారణంగా కొద్దికాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన భార్య గతంలోనే మరణించారు. నాసర్‌వలికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఐదు దశబ్దాలకు పైగా కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ పిలుపు మేరకు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన తొలిసారి 1981లో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కృష్ణలంక ప్రాంత కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతరం 1994లో రెండోసారి కూడా కృష్ణలంక ప్రాంతం నుంచే కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌, వామపక్షాల పొత్తులో భాగంగా 2004లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిగా నాసర్‌వలీ పోటీచేసి గెలుపొందారు.
అంచెలంచెలుగా ఎదిగిన నేత…
సుమారు ఐదున్నర దశాబ్దాల కిందట కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన నాసర్‌వలీ అంచెలంచెలుగా ఎదిగారు. విద్యార్థి సమాఖ్య నగర నాయకుడిగా, ఆర్‌టిసి పోర్టర్స్‌ ముఠా సంఘం అధ్యక్షుడిగా, ఇసుక ముఠా సంఘం నాయకుడిగా, ఎఐటియుసి నాయకుడిగా వ్యవహరించారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, దాసరి నాగభూషణరావుల నేతృత్వంలో జరిగిన భూపోరాటాల్లోనూ పాల్గొన్నారు. చివరి వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా నిలిచి పార్టీ విస్తరణకు విశేష కృషి చేసిన నాసర్‌వలి నేటి, భావితరాలకు ఆదర్శనీయమని పలువురు నాయకులు కొనియాడారు.
చాడ, పల్లా ప్రభృతుల సంతాపం
షేక్‌ నాసర్‌వలి మృతి పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయవాడ నగర సమస్యలపై ఆయన అసెంబ్లీలో పోరాడేవారని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆయన పట్టుదలతో పనిచేసేవారని చాడ, పల్లా గుర్తు చేసుకున్నారు. తమతో కలిసి ఐదేళ్లపాటు నాసర్‌వలి కూడా ఎమ్మెల్యేగా వుండి, తమకు ఎన్నో అనుభూతులను మిగిల్చారని, కార్మిక నేతగా, విజయవాడ కార్పొరేటర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన తీరు అనన్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటమే ఆయనను ఆ స్థాయికి తీసుకువచ్చిందని చాడ, పల్లా గుర్తు చేసుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?