ప్రజాపక్షం / హైదరాబాద్ ప్రముఖ సీనియర్ సినీ నటులు రావి కొండలరావు మంగళవారం మరణించారు. గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. రావి కొండలరావు సినీ రచయితగానే కాకుండా నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రాముడు భీముడు, తేనె మనసులు, ప్రేమించి చూడు, అలీబాబా 40 దొం గలు, అందాల రాముడు, దసరా బుల్లోడు చిత్రాలు సహా 600లకు పైగా చిత్రాల్లో నటించి అందరి అభిమానం చూరగొన్నారు. ఆయన భార్య దివంగత రాధాకుమారి కూడా సినిమా నటే. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు. రావి కొండలరావు ఫిబ్రవరి 11, 1932లో జన్మించారు. 1953లో ఓ మలయాళ చిత్రాన్ని తెలుగులోకి అనువదించగా… దానికి స్క్రిప్టు రాయడంతోపాటు, గాత్ర దానం కూడా చేశారు. అలా కొండలరావు సినిమా రంగంలోకి ప్రవేశించారు. సినీ రచయిత డివి నరసరాజు సూచనతో… పొన్నలూరి బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘శోభ’ (1958) చిత్రానికి కొండలరావు సహాయ దర్శకుడిగా పని చేశారు. అందులో అనుకోకుండా డాకర్ట్ పాత్రను ధరించి నట జీవితానికి శ్రీకారం చుట్టారు. ముళ్లపూడి రాసిన ‘దాగుడుమూతలు’, ‘ప్రేమించి చూడు’ రావి కొండలరావు నటుడిగా స్థిరపడటానికి దోహదం చేశాయి. ‘పెళ్ళి పుస్తకం’ చిత్రానికి కథను అందించి, స్వర్ణ నంది పురస్కారం పొందారు. ‘బృందావనం’, ‘భైరవ ద్వీపం’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ వంటి చిత్రాల నిర్మాణ, రచన బాధ్యతలు చూసుకున్నారు. ‘బంగారు పంజరం’లో నటనకుగాను నంది పురస్కారం దక్కించుకున్నారు. రావి కొండలరావుకు చిన్నతనం నుంచి నాటకాలంటే సరదా. కథలు రాయడమంటే చాలా ఇష్టం. ఆయన రాసిన తొలి కథ ‘దైవేచ్ఛ’ 1949లో ’యువ’లో వచ్చింది. ఇదిలా ఉండగా, రావి కొండలరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సిఎం సంతాపం : సినీ నటులు రావి కొండలరావు మృతి పట్ల సిఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని, ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రావి కొండలరావు తన కాలంలో ఉత్తమమైన నటులని సిఎం ఒక సంతాప సందేశంలో కొనియాడారు.
సినీ నటుడు రావి కొండలరావు మృతి
RELATED ARTICLES