రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
లోక్‌సభ ఎన్నికల వరకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డే పిసిసి చీఫ్
ప్రజాపక్షం / హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులుగా మల్లు భట్టివిక్రమార్క వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు, మూడు రోజు ల్లో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సిఎల్పి నాయకుడి ఎన్నికతో పాటు, సిఎల్పి కార్యవర్గాన్ని కూడా నియమించుకునే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలో బుధవారం నాడు ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీతో ఎఐసిసి ప్రధానకార్యదర్శులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు, సిఎల్పి ఎన్నికకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్.సి.కుంటియా, కార్యదర్శులు బోసురాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన బిజీగా ఉన్న అధిష్టానం, ఆ పని పూర్తి కావడంతో తెలంగాణపై దృష్టి సారించింది. అందులో భాగంగా తొలుత సిఎల్పి నాయకుని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. శాసనభకు కాంగ్రెస్ తరుపున 19 మంది ఎంఎల్ఏలు ఎన్నికయ్యారు. వారిలో పిసిసి ఛీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఉన్నారు. అయితే, పంచాయతీ ఎన్నికల షెడ్యూలు వెలువడడం, ఆ తరువాత వెంటనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో పిసిసిలో మార్పులు చేసేందుకు అధిష్టానం సముఖంగా లేనట్లు తెలిసింది. ఏమైనా మార్పులు చేసినా కొత్త నాయకత్వానికి వెంటనే పార్టీపై పట్టురావడానికి సమయం పడుతుందని, ఎన్నికల ముందు అది సమంజసం కాదని, ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఆ వైఫల్యం అప్పుడే వచ్చిన నాయకత్వంపై పడే ప్రమాదమున్నదని , అందుకే పిసిసి విషయంలో లోక్‌సభ ఎన్నికల వరకు ఎలాంటి మార్పులు చేయవద్దనే నిర్ణయానికి వచ్చింది.