అరవై ఏళ్లుగా భూములకు పాస్ పుస్తకాలు లేని వైనం
ఆన్లైన్లో లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం
పట్టాల కోసం కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు
పట్టించుకోని అధికారులు.. చావే శరణ్యమంటున్న రైతన్నలు
ప్రజాపక్షం/శామీర్‌పేట (మేడ్చల్ జిల్లా)
సాక్షాత్తు సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో దళిత రైతుల భూములకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు కాకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం
లేదు. ప్రభుత్వం నుంచి ఎస్సిలకు మంజూరైన సబ్సిడీ పధకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పట్టించుకున్న నాధుడే లేడని దళిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సర్వేనెంబర్ 22, 30లో సుమారు 113 ఎకరాల భూములను గ్రామంలోని సుమారు 45 దళిత కుటుంబాలు గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. కాగా కొంత మంది రైతులకు పాత పట్టాపాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వెబ్సైట్లో ఈ భూములను పొందుపర్చడం లేదని, దీంతో రైతులకు కొత్త పట్టాపాస్ పుస్తకాలు మంజూరు కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని పలుమార్లు స్ధానిక మంత్రికి, జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత స్ధాయి అధికారులకు, మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాస్ పుస్తకాలు వస్తాయని ఎదురు చూసినా నిరాశే మిగిలిందని రైతులు చెబుతున్నారు. భూములు ధరణిలో నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, పిఎం కిసాన్ తదితర సంక్షేమ పథకాలకు దళితులు నోచుకోవడం లేదు. ఇటీవల గ్రామంలో మరణించిన ముగ్గురు దళిత రైతుల కుటుంబాలకు రైతుబీమా రాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ భూములకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని దళిత రైతులు కోరుతున్నారు.
చావే శరణ్యం దళిత రైతు
బాలమల్లేష్ మూడుచింతలపల్లి
“కెసిఆర్ మాకు పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వకుంటే అందరం ముకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడుతాం. గత 60 ఏళ్లుగా మా భూములను సాగు చేసుకుంటూ పాత పట్టా పాస్ పుస్తకాలు ఉన్నా గానీ కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు తాత్సరం చేస్తున్నారు. భూముల విలువ పెరుగుతున్నా మా భూములను క్రయవిక్రయాలు చేయలేని దుస్ధితిలో ఉన్నాం. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ మా గ్రామ రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి” అని మూడుచింతలపల్లి గ్రామ బాధితుడు బాలమల్లేష్ చెప్పారు.
సిఎం దత్తత గ్రామంలో పట్టాలెరుగని దళిత రైతులు
RELATED ARTICLES