ఆ స్థానంలో కేంద్రమంత్రి
ప్రతిపక్షాల నిరసనలమధ్య రాజ్యసభలో బిల్లు
సుప్రీంకోర్టు తీర్పును హేళన చేశారు : ప్రతిపక్షం విమర్శ
ఎన్నికల సంఘాన్ని తోలుబొమ్మ చేసి ఆడించేందుకే బిల్లు : కాంగ్రెస్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు మిగిలిన ఎన్నికల కమిషనర్లను ఎంపికి చేసేందుకు ఉద్దేశించిన అత్యున్నతస్థాయీ కమిటీ నుండి భారత ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తికి ఉద్వాసన పలికేందుకు బిజెపి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆయన స్థానంలో కేంద్ర క్యాబినెట్ స్థాయీ మంత్రిని నియమించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించిన ఒక బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాల తీవ్ర నిరసనలమధ్య ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ప్రతిపాదించిన ప్రకారం ఈ కమిటీలో ప్రధానమంత్రితోపాటు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నియమించే క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో ఇప్పటివరకూ భారత ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఆయన స్థానంలో కేంద్రమంత్రి ఒకరు సభ్యుడుగా వస్తారు. దీంతో పూర్తిగా ఈ కమిటీలో పార్లమెంటుకు చెందిన ప్రజాప్రతినిధులు మాత్రమే
ఉండినట్లవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో అత్యున్నతస్థాయీ అధికారులైన సి.ఇ.సితోపాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకుంటున్నదన్న వివాదం గడచిన మార్చినెలలో సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని తీవ్రంగా మందలించి ఇకమీదట ఎన్నికల కమిషనర్ల నియామకాలకు కూడా ఒక అత్యున్నతస్థాయీ కమిటీ ఉండాలని ఆదేశించింది. అయితే ఢిల్లీబిల్లు తరహాలోనే సుప్రీంకోర్టు తీర్పును కూడా హేళన చేస్తూ అసలు ఈ కమిటీలోంచి భారత ప్రధాన న్యాయమూర్తినే తొలగించి ఆయన స్థానంలో కేంద్రమంత్రిని నియమించేందుకు, తిరిగి యథాతథంగా తమకు అనుకూలమైనవారిని ఇ.సిలుగా, సిఇసిలుగా నియమించుకునేందుకు వీలుగా ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. న్యాయశాఖామంత్రి అర్జున్ రామ్ మేఘావాలా ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గడచిన మార్చినెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని, హేళన చేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్, ఆప్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను కమిషన్‌ను తోలుబొమ్మనుచేసి ఆడించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ మండిపడింది. వచ్చే ఏడాదిలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒకరు పదవీ విరమణ చేస్తారు. ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే 2024 ఫిబ్రవరి 14వ తేదీనాటికి 65 వయసు పూర్తి చేసుకోవడంతో ఆయన విశ్రాంత జీవితంలోకి వెళతారు. ఆయన స్థానంలో కొత్త ఇ.సి ఎంపిక జరగాల్సి ఉంటుది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఆయన వైదొలగుతూ ఉండటం, ఆయన స్థానంలో మరో ఇ.సి. నియామకం నేపథ్యంలో ఈ కమిటీలో మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది.
సిఇసి, ఇసిల ఎంపిక కమిటీ నుంచిసిజెఐకి ఉద్వాసన
RELATED ARTICLES