సింధుకు పద్మ భూషన్‌… మేరీకోమ్‌కు పద్మ విభూషన్‌

న్యూ ఢిల్లీ : 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతల పేర్లను శనివారం సాయంత్రం ప్రకటించింది. దేశంలో సామాజిక సేవలను అందించిన పలు రంగాల్లోని ప్రముఖులకు ప్రభుత్వం ఈ అవార్డులను అందజేయనుంది. ప్రముఖ భారతీయ బాక్సర్‌, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ ఎంసి మేరీ కోమ్‌కు ప్రతిష్టాత్మకమైన దేశీయ రెండో అతిపెద్ద గౌరవ పురస్కారం పద్మ విభూషన్‌ అవార్డు దక్కింది. అలాగే ప్రపంచ చాంపియన్‌, ఒలింపిక్‌ రజత పతక విజేత భారత షట్లర్‌ పివి సింధుకు దేశీయ మూడో అతిపెద్ద గౌరవ పురస్కారమైన పద్మ భూషణ్‌ అవార్డు దక్కింది. రిపబ్లిక్‌ డే వేడుకుల సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల్లో వీరిద్దరి పేర్లను కేంద్రం ప్రకటించింది. గత ఏడాదిలోనే మేరీకోమ్‌, సింధుల పేర్లను భారతీయ క్రీడా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. 2013లోనే మేరీ కోమ్‌ పద్మ భూషణ్‌ అవార్డు గెలుచుకుంది. 2006లో పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకుంది. మరోవైపు సింధు కూడా 2017లో పద్మశ్రీ అవార్డుకు నామినేట్‌ అయింది. కానీ, తుది జాబితాలో సింధుకు అవార్డు దక్కలేదు. 2015లో సింధు పద్మశ్రీ అవార్డు గెలుచుకుంది. వీరిద్దరూ మాత్రమే కాకుండా.. ప్రముఖ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌, భారతీయ మహిళా హాకీ టీమ్‌ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, షూటర్‌ జితూ రాయ్‌ లకు కూడా పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

DO YOU LIKE THIS ARTICLE?