సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
హైదరాబాద్: కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సర్య్కులర్ ప్రకారం సింగరేణి కాలరీస్ అండర్ గ్రౌండ్ మైన్స్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా లాక్డౌన్ ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు బుధవారం ఒక లేఖ రాశారు. సింగరేణి కాలరీస్ అండర్ గ్రౌండ్ బొగ్గు గనులలో కార్మికులు కొనసాగిస్తున్న పనుల నిలిపివేత కోసం జోక్యం చేసుకోవాలని మార్చి 28వ తేదీన చాడ ఒక లేఖ రాశారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సర్య్కులర్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ మొదటి షిఫ్ట్ నుండే కోల్ ఇండియా గనులలో అండర్ గ్రౌండ్ మైన్స్ మూసివేశారు. కానీ సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు దానికి అమలుపరచలేదని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సింగరేణి కాలరీస్ అండర్ గ్రౌండ్ మైన్స్‌ను తక్షణమే మూసివేయాలని, మిగిలిన సింగరేణి ఓఫెన్ కాస్ట్ గనులలో కార్మికులు పని చేస్తున్న ప్రాంతాలలో కరోనా వైరస్ అరికట్టడానికి చేపట్టాల్సిన తక్షణ చర్యలు అమలు చేయాలని, తద్వారా సింగరేణి గనులలో ఇతర కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా జోక్యం చేసుకుని సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్స్‌ను తక్షణమే మూసివేయడానికి సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఇతర ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు, తక్షణ చర్యలు తీసుకోవాలని తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సింగరేణి కాలరీస్‌లో లాక్డౌన్ ప్రకటించాలి
RELATED ARTICLES