మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల తేదీలపై ప్రకటన?
వాటితో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు రం గం సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశమున్నట్లు శుక్రవారం అధికార వర్గాలు సంకేతాలిచ్చాయి. ప్రస్తుతం లోక్‌సభ కాల పరిమితి జూన్ 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏ నెలలో ఎన్నికలను జరపాలి, ఎన్ని దఫాల్లో నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తోందని వెల్లడించాయి. అయితే అందుబాటులో ఉన్న భద్రతా బలగాలు, ఇతర అవసరాలపై ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించాలనేది ఆధారపడి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఎన్నికల తేదీలపై మార్చి మొదటి వారంలో ప్రకటన ఉంటుందని పేర్కొన్నాయి. గతంలో నిర్వహించిన మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడి శా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇసి నిర్వహించే అవకాశముంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని రద్దు చేసిన నాటి నుంచి ఆరు నెలల్లో తాజాగా ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ కట్టుబడి ఉన్నది. నవంబర్ 2018లో అసెంబ్లీ రద్దు కాగా, ఎన్నికల నిర్వహించేందుకు గరిష్ఠంగా మే వరకు సమయం ఉన్నది. ఈ తరుణంలో లోక్‌సభతో పాటు జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇసి యోచిస్తోంది. సాధారణంగా అయితే ఆరేళ్ల జమ్మూకశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి మార్చి 16, 2021లో ముగియాలి. ఈ రాష్ట్రానికి అసెంబ్లీ కాలం ఆరేళ్లు ఉండగా, లోక్‌సభకు, ఇతర రాష్ట్రాల శాసనసభ కాలపరిమితి ఐదేళ్లు మాత్రమే. ఇదిలా ఉండగా, సిక్కిం అసెంబ్లీ కాలపరిమితి మే 27, 2019న, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితులు వరుసగా జూన్ 18, జూన్ 11, జూన్ 1న మిగియనున్నాయి. 2004లో నాలుగు విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల తేదీలను ఫిబ్రవరి 29న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొదటి విడతగా ఏప్రిల్ 20న, చివరి విడతగా మే 10న ఎన్నికలు జరిగాయి. 2009లో మార్చి 2న షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం ఐదు దఫాలుగా ఎన్నికలు జరగగా, మొదటి దఫా ఏప్రిల్ 16న, చివరి విడత మే 13న పోలింగ్ జరిగింది. అదే విధంగా 2014లో ఎన్నికల కమిషన్ మార్చిన 5న తేదీలను ప్రకటించింది. మొత్తం 9 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్, మే రెండు నెలల్లో నిర్వహించారు. మొదటి విడతగా ఏప్రిల్ 7న, చివరి విడతగా మే 12న ఎన్నికలు జరిగాయి.