సారూ… ఎప్పుడొస్తారు?

సిఎం కోసం పోడు రైతుల ఎదురు చూపు
వస్తానని ఏడాదైంది
దశాబ్దాలు గడచిన పోడు రైతులకు దక్కని హక్కు

ప్రజాపక్షం/ ఖమ్మం ; వ్యవసాయ కూలీలుగా అనేక దశాబ్దాలుగా అటవీ సమీప గ్రామాల్లో నివసిస్తున్న పేదలు పోడు నరికి వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రతి ఏటా వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో పోడు సాగవుతున్న ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. నిరుపేదలు సీజన్‌ ప్రారంభంలో దుక్కులు దున్నేందుకు ప్రయత్నించడం.. పోలీసులు, అటవీ శాఖాధికారులు అడ్డుకోవడం.. ఈ ప్రాంతంలో ఏటా జరుగుతోంది. పోడు రైతులను అదుపులోకి తీసుకోవడం ఆ తర్వాత జైళ్లకు తరలించడం జరుగుతూనే ఉంది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలో పోడు రైతులపై పోలీసుల దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గిరిజన రైతుల నివాసాలపై రాత్రి వేళ్లల్లో దాడి చేసి జైలుకు తరలించడం తల్లిదండ్రులు జైలులో ఉండగా పసిపిల్లలు జైలు బయట గడిపిన ఘటనలు ప్రజలు ఇంకా మరచిపోలేదు. గత శాసన సభ ఎన్నికల సందర్భంగా ఏజెన్సీ ప్రాం తంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ ప్రధానంగా పోడు సమస్యనే ప్రస్తావించా రు. పోడు రైతులను ఇబ్బంది పెట్టబోమని భరో సా ఇస్తూనే పోడు సమస్యకు వీలైనంత త్వరలో పరిష్కారం చూపుతామని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ రెండు రెజుల పాటు ఉండి పోడు భూములపై సమీక్షిస్తామని రెవెన్యూ, అటవీ, పోలీస్‌ శాఖలతో సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి ఏ పోడు రైతుకు అన్యాయం జరగకుండా చూస్తామని కెసిఆర్‌ తెలిపారు. కొత్త పోడు నరికితే సహించేది లేదని కూడా హెచ్చరించారు. ఏడాది కాలంలో పోడు సమస్య గురించి ప్రస్తావించని ముఖ్యమంత్రి ఏడాది తర్వాత ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పోడు సమస్యను ప్రస్తావించినా ముఖ్యమంత్రి నేనే స్వయంగా వెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్నా భూమిపై ఎటువంటి హక్కులు లేక ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతున్నారు. పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడిన రైతులు ముఖ్యమంత్రి రాకకోసం ఎదురు చూస్తున్నారు. పోడు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?