ఢిల్లీలో నేడు ఇడి ముందుకు కవిత?
న్యూఢిల్లీ: బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ ఎంఎల్సి కల్వకుంట్ల కవితను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ముందు హాజరుకానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తొలుత కేవలం సాక్షిగానే కవితను పేర్కొన్న ఇడి, ఆతర్వాత కోర్టులో ఆమె పేరును అనుమానితురాలిగా మార్చిన విషయం తెలిసిందే. ఈనెల 11న కవితను ఇడి అధికారులు సుమారు తొమ్మిది గంటలు విచారించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు. అయితే, ఆ విచారణకు హాజరుకాని కవిత, తన వివరణను బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఇడి అధికారులకు పంపారు. అంతేగాక, తనను విచారణ నుంచి మినహాయించాలని, అరెస్టు చేయకుండా ఇడిని అడ్డుకోవాలని కోరుతూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని ఈనెల 24న విచారించనున్నట్టు సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. అత్యవసరంగా విచారిణకు స్వీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఈనెల 20న విచారణకు రావాలని ఇడి సమన్లు జారీ చేయడంతో, ఆదివారం ఆమె ఢిల్లీ వెళ్లారు. వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కెటి. రామారావు, ఎంపి
సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.ప్రస్తుతం కస్టడీలో ఉన్న మరో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లుతై కలిసి కవితను విచారించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే, ప్రస్తుతం తన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున, విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అన్నది తెలియరావడం లేదు. కేసులోమరో ముద్దాయి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని విచారించిన ఇడి, అతను చెప్పిన అంశాలను కవిత, పిళ్లు నుంచి సేకరించే సమాచారంతో పోల్చిచూసే అవకాశాలున్నాయని అంటున్నారు. కానీ, కవిత సోమవారం కూడా విచారణకు హాజరుకాకుండా తన ప్రతినిధిని పంపవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఇలావుంటే, కవితను ఇడి అధికారులు అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆమెను అదుపులోకి తీసుకుంటే, తదుపరి వ్యూహాలపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇడి ముందుకు ఆమె వెళతారా? ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా? మరోసారి గైర్హాజరవుతారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఇలావుంటే, కవిత దాఖలు చేసిన పిటిషన్పై తన వాదన వినిపించకుండా ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవద్దని కోరుతూ సుప్రీంకోర్టులో ఇడి కేవియెట్ పిటిషన్ను దాఖలు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అరెస్టు చేయకుండా ఇడిని అడ్డుకోవాలని కూడా కవిత తన పిటిషన్లో కోర్టును కోరిన కారణంగా, ఇడి ఈ కేవియెట్ను దాఖలు చేసి ఉండవచ్చన్న వాదన వినిపిస్తున్నది. ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలకు తావిస్తున్నది.