భారత్ అంతర్జాతీయ సరిహద్దులో అప్రమత్తమైన బిఎస్‌ఎఫ్
న్యూఢిల్లీ/జమ్ము: భారత్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు కంచె కింద సొరంగాన్ని గుర్తించినట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారులు శనివారం తెలిపారు. పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును నియంత్రించేందుకు, మాదకద్రవ్యాలు, ఆయుధాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చొరబాటుదారుల నిరోధక గ్రిడ్ చెక్కుచెదరకుండా ఉండేలా చూడాలని బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్తానా తన సరిహద్దు కమాండర్లకు ఆదేశించారు. సొరంగంలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగులపై పాకిస్థాన్ గుర్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారత్ వైపు సరిహద్దు కంచె నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్న ఈ సొరంగాన్ని.. జమ్ములోని సాంబా సెక్టార్‌లో గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బిఎస్‌ఎఫ్ గుర్తించింది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని చోట్ల భూమి మునిగిపోతున్నట్లు గమనించిన బిఎస్‌ఎఫ్ జవాన్లకు అనుమానం వచ్చిందని, దాంతో భూమిని కదిలించే యంత్రంతో వెళ్లి చూడగా నిర్మాణంలో ఉన్న 20 మీటర్ల పొడవు సొరంగం బయటపడిందని చెప్పారు. ఈ సొరంగం ప్రారంభంలో 25 అడుగుల లోతును కలిగి ఉన్నదని, బిఎస్‌ఎఫ్ ‘తిమింగలం’ సరిహద్దు పోస్ట్ సమీపంలోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇతర రహస్య నిర్మాణాలను గుర్తించడానికి ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మెగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ పర్యవేక్షణ కోసం బిఎస్‌ఎఫ్ ఇన్స్‌పెక్టర్ జనరల్ (జమ్ము) ఎన్‌ఎస్ జమ్వాల్ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. జమ్ము, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వెంబడి 3,300 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దులో మోహరించిన బిఎస్‌ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు ఐబిని ఉల్లంఘించి దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సొరంగాలను గుర్తించేందుకు భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్లను మోహరించడానికి సరిహద్దు దళం ప్రయత్నిస్తున్నది. గతంలో కూడా జమ్ము సరిహద్దులో బిఎస్‌ఎఫ్ సొరంగాలను గుర్తించాయి.