ప్రజాపక్షం /హైదరాబాద్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాల వేదిక సంయక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) సంయుక్తంగా ఈ నెల 16న పిలుపునిచ్చిన దేశవ్యాపిత సమ్మె, గ్రామీణ బంద్‌కు వామపక్షాలు మద్దతు ప్రకటించా యి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలో క్రియాశీలంగా పాల్గొనాలని బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ -మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఇప్పటికే రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారని, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ప్రదర్శన మీద తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదని వామపక్షాలు పేర్కొన్నాయి. నిత్యావసర సరుకుల ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించడంలో వైఫల్యం చెం దిందని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వాగ్దానం గాలికి వదిలేసింది. రైతాంగం కోరుతున్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో హామీ నిలబెట్టుకోలేదని, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించేలా ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తోందని విమర్శించాయి. కార్మిక చట్టాలను బలహీనం చేసే నాలుగు రకాల లేబర్ కోడ్లను సిద్ధం చేసి కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చిందన్నాయి. ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా ఎదుర్కోలేక రామాలయం ప్రారంభోత్సవాన్ని ముందుకు తెచ్చి హిందూత్వ రాజకీయాలతో ఓటు బ్యాంకు పెంచుకుని తిరిగి గద్దె నెక్కడానికి సిద్ధమవుతున్నదని తెలిపాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, రైతు, వ్యవసాయ కార్మికులు తలపెట్టిన సమ్మెను, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి.
సమ్మె, గ్రామీణ బంద్‌కు వామపక్షాలు మద్దతు
RELATED ARTICLES