HomeNewsBreaking Newsసమరయోధుల పెన్షన్లు నిలిపి నిస్సిగ్గు ప్రకటనలా!

సమరయోధుల పెన్షన్లు నిలిపి నిస్సిగ్గు ప్రకటనలా!

కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై కూనంనేని మండిపాటు
సెప్టెంబర్‌ 17ను విలీనదినంగా నిర్వహించాలి ముఖ్యమంత్రికి లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌
భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి, అందులో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయో ధులకు ఇచ్చే పెన్షన్‌లను గతంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ కొత్తగా సిఫార్సు చేసిన వారికి మంజూరు చేయకుండా నిలిపివేసిందని, అలాంటి ప్రబుద్దులు నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నైజాం వ్యతిరేక పోరు మాట ఎత్తే నైతిక హక్కు బిజెపికి లేదని, కమ్యూనిస్టు పార్టీ, నాటి కాంగ్రెస్‌ జాతీయవాదులు ఆనాటి ఫ్యూడల్‌ వ్యవస్థపై తిరుగుబాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న తలపెట్టిన కార్యక్రమాన్ని తెలంగాణ విలీన దినంగా నిర్వహిస్తే
బాగుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటయోధుల చరిత్రను భావితరాలకు తెలియపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పలు ప్రతిపాదనలు చేస్తూ మంగళవారం నాడు కూనంనేని లేఖ రాశారు. ఆనాటి కమ్యూనిస్టు యోధులు రావి నారాయణ రెడ్డి , మఖ్దూం మొహియొద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి ముగ్గురు యోధుల విగ్రహాలు ట్యాంక్‌ బండ్‌ పైన ఏర్పాటు చేయడం చేయడం ద్వారా సముచిత గౌరవం ఇచ్చినట్లయిందని పేర్కొన్నారు. ట్యాంక్‌ బండ్‌ పై ఉర్దూ సాహితీవేత్తగా మఖ్దూం మోహియొద్దీన్‌ విగ్రహం ఉన్నప్పటికీ , ఆయనను పోరాటయోధుడుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బొమ్మగాని ధర్మభిక్షం వంటి యోధుల విగ్రహాలను ఆయా కూడలులలో పెట్టి గౌరవించాలని కోరారు. ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కంటే అధిక ఓట్లు సాధించి, ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమైన పార్లమెంట్‌ భవనానికి ప్రారంభోత్సవం చేసిన రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలని సీఎంకు రాసిన లేఖలో కూనంనేని పేర్కొన్నారు. సాయుధ పోరాటంలో దాదాపు నాలుగు వేల మంది అమరులయ్యారని, అందుకు చరిత్ర సాక్ష్యమని, వారిని గుర్తించి వారిపేర్లతో ఢిల్లీలోని ఇండియా గేట్‌ మాదిరిగా స్మారక స్థూపాన్ని, మ్యూజియంను ఏర్పాటు చేయాలని కోరారు. జీవించి ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు గౌరవ పెన్షన్‌ ఇవ్వాలని, సాయుధ పోరాటంలో పాల్గొని ఇప్పటికీ జీవించి ఉన్న యోధులను ఉత్సవాలలో సన్మానించాలన్నారు. ఆనాటి రైతాంగ సాయుధ పోరాటాన్ని, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మోహియొద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డిల త్యాగాలను చరిత్రలో నిలిచిపోయేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్చాలని కోరారు. తెలంగాణ సమైక్యతా దినోత్సవం రోజున ఈ ప్రతిపాదలను అధికారికంగా ఆమోదించి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. వెట్టిచాకిరి రద్దుకు తొలిపునాది వేసిందని, బానిసత్వానికి వ్యతిరేకంగా, కాళ్లు మొక్కుతా బాంఛన్‌ దొర అనే దానిని నుండి బందూకు పట్టుకొని తిరగబడే స్థితికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీ ప్రజలను చైతన్యవంతులను చేశాయన్నారు. వెట్టిచాకిరిలో మునిగిన మట్టి మనుషులని పోరాటయోధులుగా తీర్చిదిద్దడంలో నాటి పోరాటం మహోజ్వల పాత్ర పోషించిందని తెలిపారు. ఆనాటి పోరాట సంస్కతి ఇప్పటికి తెలంగాణ ప్రజల గుండెల్లో విడదీయరాని బంధంగా ఉన్నదని, కులాలకు అతీతంగా, వెట్టిచాకిరి, బానిస సంస్కతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు తెలంగాణ ప్రతి గ్రామగ్రామాన గోచరిస్తాయని, ఆనాటి కమ్యూనిస్టుల పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
నాటి సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్రలేని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు మతోన్మాదాన్ని అంటగట్టి సాయుధ పోరాటానికి వక్ర భాష్యాలు చెబుతున్నాయని కూనంనేని అన్నారు. అసత్యాలతో, వక్రీకరణలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్లు ఈ పోరాటాన్ని హైజాక్‌ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నదని, కమ్యూనిస్టు పార్టీలు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విలీన దినంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపాలని పోరాటం చేశారని సీఎంకు రాసిన లేఖలో కూనంనేని గుర్తు చేశారు. కమ్యూనిస్టులుగా, పోరాట వారసులుగా విలీన దినాన్ని జరపాలని పోరాటం చేస్తున్నదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments