ఈ నెలాఖరున అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం
మంత్రి తుమ్మల వెల్లడి
రైతు సమస్యలపై మంత్రికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వినతి
ప్రజాపక్షం/హైదరాబాద్ అఖిలపక్ష రైతు సంఘాల సమావేశాన్ని ఈ నెల చివరలో ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హామీనిచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్మపద్మ తెలిపారు. సమగ్ర భూ సర్వే నిర్వహించకుండా రైతుల భూ హక్కులను కాపాడలేమని, అందుకు చర్యలు అవసరమని,
రైతు సంఘం తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలన్నింటినీ, ముఖ్యంగా సమగ్ర భూ సర్వే అంశాన్ని కూడా సిఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీనిచ్చినట్టు వివరించారు.కాళేళ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం, వర్షభావ పరిస్థితులు, ఎండల ప్రభావం ఇప్పుడే మొదలైన నేపథ్యంలో ప్రస్తత వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించి, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించారు. వర్షాభావం ఏర్పడిన నేటి పరిస్థితులలో ఆరుతడి పంటలైన కుసుమ, ఆముదం నువ్వులు, కందులు తదితర పంటలకు విత్తనాలు సకాలంలో లభించేలా జిల్లా స్థాయిలలో విత్తన నిలువలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనితెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్మపద్మ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ప్రభులింగం, పరుచూరి జమున, రామకృష్ణా రెడ్డి రాంరెడ్డి తదితరులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం కలిసి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పశ్మపద్మ మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. మహిళా రైతులు పండించిన కూరగాయలను ,పండ్లను, తాజా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు అనుమతినిస్తామని మంత్రి తుమ్మల హమీనివ్వడంతో పాటు రవాణ శాఖ మంత్రితో అఅక్కడికక్కడే మాట్లాడి, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు పశ్మ పద్మ వివరించారు. 24 గంటల విద్యుత్తును అందుబాటులో ఉండాలని, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ,రైతులే విద్యుత్ ఉత్పత్తిదారులుగా కోన సాగటానికి సోలార్ పొలాలుగా అభివృద్ధి చేసేందుకు, పంటల బీమా పథకంపై అఖిలపక్ష రైతు సమావేశంలో చర్చిస్తామని, సంబంధిత మంత్రులను అధికారులను రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తామని మంత్రి చెప్పినట్టు పశ్మపద్మ వివరించారు.
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, రైతుకు ఏ సమస్య వచ్చినా పరిష్కారించేలా రాష్ట్రస్థాయిలో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కమిషన్ కు చట్టబద్ధమైన అధికారం ఉండాలని పశ్మపద్మ ప్రభుత్వాన్ని కోరారు. చిన్న, సన్న కారు రైతుల ,మహిళా రైతుల స్థితిగతులపై సమగ్రంగా పరిశీలించి, వారి సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ జిల్లాలలో పంటల సాగు ఖర్చులు – మద్దతు ధరలను పరిగణలోకి తీసుకొని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధరలు నిర్ణయించాలని, వ్యవసాయ ఖర్చులు – ధరల నిర్ణయాక సంస్థను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. పంటల ప్రణాళికపై అధికారులతో, సైంటిస్టులతో, రైతు సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి విస్తృతంగా చర్చించి, నిర్ణయించాలన్నారు. భూసార పరీక్షలను విధిగా నిర్వహించి, పంటల దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, విత్తనాలను సబ్సిడీపై మండల స్థాయిలోపంపిణీ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భూమాత పథకం మన రాష్ట్రంలో గత ప్రభుత్వం రెవెన్యూ చట్టం పాస్ పుస్తకాల చట్టం 1971లో మార్పు చేస్తూ ‘2020 కొత్త చట్టం’ తీసుకొచ్చిందని, దీనినే ధరణి పథకంగా ప్రకటించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలోని లోపాలను సరి చేయడంలో భాగంగా భూమాత పథకం అమలుకు చర్యలు చేపట్టడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. సమగ్ర భూ సర్వే చేసి గ్రామసభలలో భూహక్కులను నిర్ధారించి, రెవెన్యూ రికార్డులను మాన్యువల్ గా తయారు చేసి,డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మరిన్ని సమస్యలు ఇవే
కాళేశ్వరం ఇతర భారీ మధ్యతరహ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై హైకోర్టు జడ్జి తో విచారణ జరిపించాలి. సబ్సిడీపై మైక్రో ఇరిగేషన్ పథకాల అమలు చేయాలి. లిఫ్ట్ పథకాలను రిపేర్లు చేసి ప్రభుత్వమే నిర్వహించాలి. రాష్ట్ర విత్తన చట్టం చేయాలి. కౌలు రైతులను గ్రామ సభలలో భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తించాలి. కౌలు చేయడాన్ని ఒక జీవనోపాధి గా గుర్తించాలి. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక హామీలో భాగంగా రైతు భరోసా, రెండు లక్షల రుణమాఫీనిఅమలు చేయాలి. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి. అదిలాబాద్, నల్గొండ ,ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ , మెదక్ ఉమ్మడి జిల్లాలలోని ప్రాజెక్టులను నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలి. నకిలీ విత్తనాలను యుద్ధ ప్రాతిపదిక అరికట్టడానికి, నాణ్యమైన విత్తనాల తయారీకి సరఫరాకు విత్తన చట్టం అవసరం.విత్తనాల నిలువలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాన్ని రాష్ట్రస్థాయిలో అమలు చేయాలి. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల పరిహారం ఇవ్వాలి. వ్యవసాయ పరికరాలు సబ్సిడీతో ఇవ్వాలి. పరికరాల అద్దె కేంద్రాలను, రిపేర్ సెంటర్లను మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి, ప్రభుత్వమే నిర్వహించాలి. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం అర్హులకు హక్కుపత్రాలు ఇవ్వాలి. రైతుకు బయో ఫెర్టిలైజర్స్‌ను, బయో పెస్టిసైడ్స్‌ను అందుబాటులోకి తేవాలి.
సమగ్ర భూ సర్వే నిర్వహించకుండా రైతు భూ హక్కులను కాపాడలేం
RELATED ARTICLES