సజావుగా మేడారం

భక్తులకు అసౌకర్యం కలగకుండా మేడారం జాతరకు ఏర్పాటు చేయండి : సిఎం ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్‌; భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, మేడారం వెళ్లిరావడానికి ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌ లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అందించారు. మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపి మాలోత్‌ కవిత తదితరులు ముఖ్యమంత్రిని కలిసి మేడారం జాతరకు ఆహ్వానించారు. అనంతరం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లను సిఎం సమీక్షించారు. “మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. మంచినీరు, పారిశుధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు మంచిది కాదు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలి. గతంలో వరంగల్‌ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను అక్కడికి పంపాలి. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలి” అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది

DO YOU LIKE THIS ARTICLE?