సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ కొత్త సచివాలయ భవనాల నిర్మాణాలకు న్యాయపమైన అడ్డంకులు తొలగిపోయాయి. క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎంఎల్‌సి టి.జీవన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపి ఎ.రేవంత్‌రెడ్డి, న్యాయవాది రజనీకాంత్‌రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సెక్రటరీ ఎం.పద్మనాభరెడ్డి, ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వర్‌రావు, మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు సోమవారం తీర్పు చెప్పింది. రాష్ట్ర మం త్రివర్గ సమావేశంలో సచివాలయం మార్పు, ఇప్పుడున్న భవనాలను కూల్చి కొత్తగా నిర్మా ణం చేయడం అనే రెండు అంశాలపై సమీక్ష చేసింది. ‘కూల్చేయాలనే నిర్ణయానికి కచ్చితంగా ఇంకా రాలేదు. ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉంది. 2012, 2013 సంవత్సరాల్లోనే సెక్రటేరియట్‌ సెక్యూటరీపై రెండు రిపోర్టులు ఉన్నాయి. 2014లో అగ్నిమాపక శాఖ కూడా రిపోర్టుపై క్యాబినెట్‌ 2015లో చర్చించింది. అప్పుడే కొత్తగా నిర్మాణాలు చేయాలని నిర్ణయం తీసుకుంటే 2016లోనే హైకోర్టులో పిల్‌ దాఖలైంది. 2019లో మళ్లీ క్యాబినెట్‌ చర్చించింది. అగ్నిమాపక శాఖ రిపోర్టులోని పలు అంశాలపై సమీక్ష చేసింది. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ, టెక్నికల్‌ కమిటీల నుంచి రిపోర్టులను తెప్పించుకున్న క్యాబినెట్‌ ఆ తర్వాత ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజిబిసి)ల నుంచి కూడా రిపోర్టు పొందింది. వీటికి అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, అందుకే పిల్స్‌ అన్నింటినీ కొట్టేయాలని ప్రభుత్వం చేసిన వాదనను ఆమోదిస్తున్నాం’ అని తీర్పులో స్పష్టం చేసింది. క్యాబినెట్‌లో 2019 జూన్‌ 18 తీసుకున్న నిర్ణయంలో రెండు అంశాలు ఉన్నాయి. ఉన్న బిల్డింగ్స్‌కు మరమ్మతులు చేయడం, రెండోది కొత్త కట్టడం.. ఇతమిద్దంగా ఉన్న భవనాల్ని కూల్చేయాలని నిర్ణయానికి రాలేదు. కొత్తగా నిర్మాణం చేయాలనీ నిర్ణయించలేదు. నిర్ణయం మధ్యస్థంగా ఉంది. కొత్తగా కట్టేస్తే సర్కార్‌పై భారంపడుతుందనే విషయాల్లోకి వెళ్లలేం. అయినా మౌలిక సదుపాయాల కల్పన వ్యవహారంపై సుప్రీంకోర్టు నర్మదా బజావో ఆందోళన్‌ కేసులో ఇచ్చిన తీర్పు ఇది కూడా పూర్తిగా విధానపరమైన నిర్ణయమే. ఇప్పుడున్న సెక్రటేరియట్‌ సరిపోతుందా లేదా అనేది ప్రభుత్వం తేల్చుకోవాల్సిన వ్యవహారం. దాని విషయంలో కోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదు. అంతేకాకుండా సెక్రటేరియట్‌ బిల్డింగ్స్‌ రిపేరుకు వీల్లేకుండా ఉన్నాయని ఎక్ప్‌పర్ట్‌ కమిటీ రిపోర్టు ఇచ్చింది. జి బ్లాక్‌ 131 ఏళ్ల నాడు కట్టారు. కూలిపోయేలా ఉంది. ఇతర భవనాల కొన్ని 70 ఏళ్లు ఉంటాయని చెప్పింది. సచివాలయం ఐజిబిసి చెప్పినట్లుగా హరిత భవన రూల్స్‌కు అనుగుణంగా లేవు. అగ్నిప్రమాదం జరిగితే మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక వాహనం వెళ్లేలా భవనాల మధ్య ఖాళీ లేదు. సిఎం ఉండే సి బ్లాక్‌ కట్టి 40 ఏళ్లు దాటిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. పలు సమస్యలతో సెక్రటేరియట్‌ ఉంది.. అని 34 పేజీల తీర్పులో పేర్కొంది. కొత్తగా కడితే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనేది కార్యనిర్వాహక విషయం. ఈ విషయంలో కోర్టుల జోక్యానికి ఆస్కారం చాలా తక్కువ. విధాన నిర్ణయాలు ఆర్థిక, ఆర్థికేతరం అని రెండుగా ఉంటాయి. ఆర్థికపర నిరణయాలపై కోర్టుల జోక్యం తక్కువని సుప్రీంకోర్టు నర్మదా బచావో కేసులో చెప్పింది. అయినా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడానికి ఎంతో కసరత్తు చేస్తుంది. అన్నీ కోర్టులకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఆర్థికేతర విధానపరమైన నిర్ణయాలలో కోర్టులకు తక్కువగా జోక్యం చేసుకునే వీలుంది. ఈ కేసులో క్యాబినెట్‌ తీసుకున్నది ఆర్థికపరమైన పర్యావసానాలున్న సాధారణ విధాన నిర్ణయం. అందుకే విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడం లేదు. ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలపై కోర్టులు ఎప్పటికీ అప్పిలేట్‌ అథారిటీ కాబోదు.. అని తీర్పు చెప్పింది. హైదరాబాద్‌ టిఎస్‌, ఎపిలకు ఉమ్మడి రాజధానంటే పదేళ్లు ఇక్కడే ఉండాలని కాదని, పదేళ్లలోగా ఎపి వెళితే హైదరాబాద్‌కు సంబంధం ఉండదని, అయినా ఎపి కూడా ఇక్కడి బిల్డింగ్స్‌ తెలంగాణకు ఇచ్చేసిందని, అమరావతిలో రాజధాని పెట్టుకుందని తీర్పులో పేర్కొంది. ఎపి పునర్‌విభజన యాక్ట్‌లోని సెక్షన్‌ 8 ప్రకారం భవనాల కేటాయింపుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలనే వాదన చెల్లుబాటు కాదని చెప్పింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని, నాలుగు వారాలపాటు తీర్పు అమలును సస్పెండ్‌ చేయాలని పిటిషనర్ల న్యాయవాదులు చేసిన వినతిని సైతం హైకోర్టు తోసిపుచ్చింది. కరోనా కారణంగా సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసేందుకు 4 వారాల సమయం కావాలని, అప్పటి వరకూ తీర్పును సస్పెండ్‌ చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇలాంటి ఎమర్జెన్సీ కేసుల్లో సుప్రీంకోర్టు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో విచారణ చేస్తోందని, ఈ ప్రయత్నాలు చేసుకోవచ్చునని ధర్మాసనం సూచన చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?