సకల జనుల సమ్మెగా..!

అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహం
రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సబ్బండ వర్గాలు పాల్గొనాలని జెఎసి నేతల విజ్ఞప్తి
వివిధ పార్టీల నేతలను కలిసిన జెఎసి నేతలు
ఏడో రోజూ కొనసాగిన ఆర్‌టిసి సమ్మె
నేడు అన్ని డిపోల వద్ద మౌనదీక్ష

ప్రజాపక్షం / హైదరాబాద్‌: ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది. సమ్మెను సకల జనుల సమ్మెగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్‌టిసి జెఎసి వ్యూహరచరన చేస్తోంది. ఒకవైపు సమ్మెను కొనసాగిస్తూనే మరోవైపు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, సబ్బండ వర్గాలను తమ పోరాటంలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు చేపట్టింది. హైదరాబాద్‌లో గురువారం జరిగిన అఖిలపక్షం సమావేశం నిర్ణయం మేరకు ఆర్‌టిసి జెఎసి నేతలు శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి సమ్మె కు మద్దతును కోరారు. టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ నేతృత్వంలో జెఎసి కన్వీనర్‌ ఇ.అశ్వద్ధామరెడ్డి, కో కె.రాజిరెడ్డి, వి.ఎస్‌.రావు, సుధాతో పాటు పలువురు నేతల ప్రతినిధి బృందం అసెంబ్లీ వద్ద సిఎల్‌పి ఉప నాయకులు డి.శ్రీధర్‌బాబును, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను, కాంగ్రెస్‌ ఎంపి ఎ.రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో, టిడిపి కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బక్కని నర్సింహులు, రాష్ర్ట అధికార ప్రతినిధులు చిలువేరు కాశీనాథ్‌, ఎన్‌.దుర్గాప్రసాద్‌లను కలిసి ఆర్‌టిసి సమ్మెలో భాగస్వాములు కావాలని కోరా రు. ఇందుకు స్పందించిన పార్టీల నేతలు ఆర్‌టిసి సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా ఆర్‌టిసి కార్మికుల ఉద్యమంలో పాలుపంచుకుంటామని వారు జెఎసి నేతలకు హామీ ఇచ్చారు. కాగా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి జనం ముందుకు వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాలని జెఎసి నేతలు విజ్ఙప్తి చేశారు. ఒక దసరా పోయినా మరొక దసరా చేసుకోవచ్చని, ఆర్‌టిసిని కోల్పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందన్నారు. అశ్వద్ధామ రెడ్డి, రాజిరెడ్డి మాట్లాడుతూ టిజిఒ, టిఎన్‌జిఒ తదితర అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా తమకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. అన్ని డిపోల వద్ద శనివారం జరిగే మౌన దీక్షలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని చెప్పారు. వరంగల్‌లో మహిళా ఆర్‌టిసి కార్మికులపై దాడి చేసిన పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేయాలని, పోలీస్‌ అధికారిపై గవర్నర్‌కు,ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేస్తామన్నారు. రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరితో నలుగురు ఆర్‌టిసి కార్మికులు మరణించడం బాధాకరమన్నారు. కార్మికులెవరూ అధైర్యపడవద్దని, కార్మికులకు మద్దతుగా తమతో పాటు రాజకీయ పార్టీ లు ఉన్నాయన్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడు తూ అన్ని పార్టీలు ఆర్‌టిసి కార్మికుల ఉద్యమానికి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.కార్మికుల ఉ ద్యమానికి రాజకీయ పార్టీల ఉద్యమం తోడైతే ప్రభు త్వం దిగివస్తుందన్నారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయాలు ముఖ్యం కాదన్నారు. అన్ని పార్టీలు ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?