వారిని కాంట్రాక్టర్లుగా చూడము : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ప్రజాపక్షం/హైదరాబాద్
ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్స్‌ను కాంట్రాక్టర్లుగా చూడటం లేదని, సంపద సృష్టించే సృష్టికర్తలుగా చూస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంపదను సృష్టించే సృష్టి కర్తలను కాపాడుకుని, ప్రోత్సహించే బాధ్యత తమదని భరోసానిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా భట్టి హాజరయ్యారు. రెండవ రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్‌ను ఆయన పరిశీలించి వాటి తయారీ, ఉపయోగం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘బిల్డింగ్ త్రూ టైం, టెక్నికల్ వాల్యూమ్’ పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నదని, దేశ సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్స్ కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. భారతదేశం ప్రజాస్వామిక, సంక్షేమ రాజ్యమన్నారు.
సంపదను సృష్టించే వారిని గాయపరచం
దేశంలో సంక్షేమ రాజ్యం అమలు కావాలంటే సంపద కావాలని, సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల సంక్షేమ అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవన్నారు. సంపద సృష్టించే సంస్థలను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండబోదని హామీనిచ్చారు. నిర్మాణ రంగంలో వచ్చిన అనేక విప్లవాత్మక మార్పులతో దేశంలో ఆ రంగం చాలా ముందుకు దూసుకు పోతున్నదన్నారు. బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకుని నిర్మాణ రంగంపై పెట్టుబడి పెట్టిన సంస్థలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాడు మార్కెట్‌లో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు నేడు కనిపించకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వతహాగా నిర్మాణ రంగంలో రాణిస్తూ జాతి నిర్మాణానికి బిల్డర్స్ చేస్తున్న కృషిని వివరిస్తూ వారికి అభినందనలు తెలిపారు.
అందమైన నగరం హైదరాబాద్..
హైదరాబాద్ చాలా అందమైన పట్టణమని, పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వాతావరణ పరంగా, ఆర్థికపరంగా, భాషా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ఉన్న వారు ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. తెలంగాణకు వచ్చి సంపద సృష్టించే వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డి, చైర్మన్ బి.శ్రీనయ్యలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చేసిన నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందన్నారు. దీంతో చాలామంది కాంట్రాక్టర్లు ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా ఇప్పించాలని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో నిర్మాణం చేసే కాంట్రాక్టర్లకు కొన్ని పన్నుల నుంచి ఇచ్చే మినహాయింపు, రాయితీలను భవన నిర్మాణం కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహక కార్యదర్శి సచితానంద రెడ్డి, రాష్ట్ర చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కో వైస్ చైర్మన్ డి.వి.ఎన్. రెడ్డి, నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ ఆర్. రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సంపద సృష్టికర్తలు బిల్డర్లు
RELATED ARTICLES