అన్ని ‘బంధు’లు ప్రచార ఆర్బాటమే తప్ప అర్హులకేవీ?
నిరుద్యోగులు, విద్యార్థులతో రాష్ట్ర సర్కార్ చెలగాటం
పరీక్షల రద్దు బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు
ప్రతిపక్షాలపై బిజెపి సర్కార్ కక్షసాధింపు చర్యలు
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
ప్రజాపక్షం / కరీంనగర్ ప్రతినిధి సంక్షేమం అనే నిర్వచనానికి భిన్నంగా రాష్ట్ర ప్రభు త్వం వివిధ సంక్షేమ పథకాలను అధికార పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరుస్తూ అసలైన అర్హులను విస్మరిస్తోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు బడాబాబులకు కాకుండా పేదరికంలో మగ్గుతున్న, ఆర్థికంగా వెనుకబడిన, అర్హులైన బడుగువర్గాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి సర్కార్, రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు, బిసిబంధు, మైనారిటీబంధు, గృహలక్ష్మిపథకాలు ప్రచార ఆర్భాటమే తప్ప అసలైన అర్హులకు ఇవ్వడంలేదన్నారు. రైతుబంధు వంటి పథకాలను సన్నకారు, చిన్నకారు సాగు చేసే రైతులతో పాటు వందల ఎకరాల భూములున్న సాగుచేయని బడా రైతులివ్వడం వల్ల ప్రయోజనమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధమైతే లోపాలు ఉన్నాయని పరీక్షలను కోర్టు రద్దు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎందుకు పారదర్శకత లోపించిందో, అందుకు కారకులు ఎవరో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువతతో కెసిఆర్ సర్కార్ చెలగాటమాడుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో సిఎం కెసిఆర్ ఘనుడని, అందుకు తమకు అభ్యంతరమే కూడా లేదని, అయితే అనేక పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అందడం లేదని ఆయన చెప్పారు. రైతుబంధు తీసుకుంటున్న వారంతా వ్యవసాయం చేస్తున్నారా? భూములు సాగు చేసుకుంటున్నారా? లేదా? అని విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుబంధు ఉద్దేశం పెట్టుబడి కోసం చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడాలనే తప్ప వందల ఎకరాల భూములున్నవారికి రైతుబంధు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రజలు పరోక్షంగా కట్టే పన్నలను ఇష్టారీతిన ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీల్లో సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వడం లేదని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయిలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ, పిఆర్‌సి పెంచి అంగన్‌వాడీ ఉద్యోగులపై చిన్న చూపు చూడకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పరిపాలన ఉండాలని, లేనట్లయితే ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్వహించక తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిజెపి నాయకులు ఎంత అవినీతి, అక్రమాలకు పాల్పడినా చూసీచూడనట్లు వ్యహరిస్తూ ప్రతిపక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ ఈడి, ఐటి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు నూతన భవనంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకుంటోందని, ఆ బిల్లును నాటి సిపిఐ ఎంపి గీతా ముఖర్జీ 1996లో పార్లమెంటులో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ బిల్లును ఇప్పుడు పార్లమెంటులో ఆమోదించి మహిళలను ఉద్దరించామని గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా కులాల జనగణన జరగలేదన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కావాలని, 2021లో జనాభా లెక్కలు చేయకుండా మోడీ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేసిందన్నారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అక్టోబర్ 3న రాష్ట్రానికి వస్తున్నారన్నారు. అన్ని పార్టీలు కసరత్తులు ముమ్మరం చేస్తుండగా బిజెపి మాత్రం అంతర్మధనంలో పడిపోయిందన్నారు. రాష్ట్రానికి అక్టోబర్ 1న మోడీని తీసుకువస్తున్నామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందె స్వామి, ్వమి సమ్మయ్య, గూడెం లక్ష్మి, బండ రాజిరెడ్డి తదితరులున్నారు.
సంక్షేమ పథకాలు.. బడుగులకివ్వాలి
RELATED ARTICLES