రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
తాగు, సాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత
స్వయంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ : రూ.6 వేల కోట్లు కేటాయింపు
రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేలు : రూ. 12 వేల కోట్లు కేటాయింపు
రైతు బీమా కోసం రూ. 650 కోట్లు కేటాయింపు
ఆసరా పెన్షన్లు రెట్టింపు : కనీస వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు
సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయం
వచ్చే ఏడాది నుంచి బిసిలకు మరో 119 గురుకులాలు
మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు
అత్యధికంగా నీటిపారుదల రంగానికి రూ. 22,500 కోట్లు
దేశ వ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ : సిఎం
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో గతంలో మాదిరిగా సంక్షేమం, సాగునీటి రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధులను కేటాయించింది. 2019- బడ్జెట్లో తాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యాక్రమాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2019- ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదించారు. సిఎం కెసిఆర్ బడ్జెట్ ప్రసం గం చేస్తూ ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని, ఇందు కోసం బడ్జెట్లో రూ.6వేల కోట్లను కేటాయించామని, అన్ని రకాల పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని సిఎం చెప్పారు. ఇందు కోసం బడ్జెట్లో రూ.1810 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 6వ బడ్జెట్ అని, స్వల్పకాలంలోనే పురోగతి సాధించామన్నారు. దేశవ్యాప్తం గా తెలంగాణను రోల్‌మోడల్‌గా చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబమే లేదన్నారు. ఈ కారణంగానే అత్యధిక మెజార్టీతో టిఆర్ఎస్ను రెండోసారి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. 2018- 19లో తెలంగాణ వృద్ధిరేటు 10.6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ఆసరా పెన్షన్ల పథకం తన హృదయానికి దగ్గరైనదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్లో అత్యధికంగా నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు కేటాయించింది. వ్యవసాయ రంగం, రైతులకు దాదాపు అంతే ప్రాధాన్యతనిస్తూ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయశాఖకు రూ.20,107 కోట్లను కేటాయించింది. రైతుబంధు పథకానికి రూ.12,000కోట్లు కేటాయించారు.
నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు
తాత్కాలిక బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ. 22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకుని 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తొలి నాలుగేళ్లలోనే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని కెసిఆర్ తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులను కూడా సంపాదించగలిగామని చెప్పారు. ఇక ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఈ వర్షాకాలంలోనే
అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.మిషన్ కాకతీయ పథకంలో భాగ ంగా 20 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. కాలువల పునరుద్ధరణ ద్వారా చెరువులకు పునర్ వైభవం తేనున్నట్లు స్పష్టం చేశారు.
రైతులకు లక్షరూపాయల రుణమాఫీ ప్రకటించిన కెసిఆర్ : లక్ష రూపాయల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.2018 డిసెంబర్11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. రైతుల్లో భరోసా పెంచామని, అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖకు రూ.20,107 కేటాయించగా, రైతుబంధ పథకం కింద ఎకరానికి ఏడాదికి అందించే మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.అలాగే రైతుబీమాకు రూ. 650 కోట్లను, రైతు రుణామఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.