శాఖలకు కాసుల సుస్తి

నిధుల్లేక నీరసిస్తున్న రహదారుల నిర్మాణం
సమ్మక్క సారలమ్మ జాతర పనులపైనా ప్రభావం ?

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ఆర్థిక మాంద్యం రాష్టాన్ని కుదిపేస్తోందా? వివిధ శాఖలకు విడుదల చేయాల్సిన నిధు లు, అభివృద్ధి పనులకూ కాసుల కటకట నెలకొందా? అంటే ప్రభుత్వ ఉన్నతాధికార వర్గా ల నుండి ఔను అనే సమాధానమే వస్తోంది. వచ్చే రెండు నెలల్లోనే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర పనుల ఏర్పాట్లు, ఈ జాతరకు వచ్చేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల రహదారుల మరమ్మతులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కటకటగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాల విషయంలో నిధుల కటకట కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వరంగల్‌ మధ్య జరిగే నాలుగు లైన్ల రహదారి పనులు పెండింగ్‌ పెట్టారు. ఈ రహదారుల్లోని బైపాస్‌ రోడ్డుకు నిధులు కేటాయించాలని స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మద్నూరు- రహదారి నిర్మాణం కోసం రూ.20 కోట్లు, అలాగే బిక్‌నూర్‌ నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు 15 కి.మీ నిడివి గల రహదారి నిర్మాణ పనులు అగ్రిమెంట్‌ పూర్తి చేసుకుని ప్రభుత్వం ఆదేశాల కోసం నిరీక్షిస్తోంది. కాంట్రాక్టర్లకు ఇప్పటికే చేసిన పనులకు చెల్లించాల్సిన నిధులు ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో అగ్రిమెంట్‌ పూర్తయి నిర్మాణం కోసం నిరీక్షిస్తున్న ఈ రహదారికి ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపడం లేదని భావిస్తున్నారు. ఆర్‌టిసి ఉద్యోగుల సమ్మె సందర్భంలోనూ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకునే సమ్మె వద్దని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉద్యోగులకు సూచించారని, అయితే ఉద్యోగులు వినకుండా సమ్మెను కొనసాగించడంతో సంస్థ మరింత నష్టాల ఊబిలోకి వెళ్లిందని ఆర్‌టిసి ఉన్నతాధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలకే ప్రతి నెలా కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి రావడం, కేంద్రం నుండి అందాల్సిన నిధులు కొన్ని సందర్భాల్లో పెండింగ్‌ పెడుతుండడంతో ఆచితూచి వ్యవహరించాలని సిఎం కెసిఆర్‌ ఆర్థిక శాఖ మంత్రికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న వాతావరణ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోనూ నెలకొంటుండడంతో ఏ పని చేయాలన్నా చూసి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని ప్రభుత్వ శాఖల్లోని అధికారులు చర్చించుకుంటున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలకు తప్పని సరిగా కేటాయించాలని, లేని పక్షంలో రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఇచ్చిన వారిమే అవుతామని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?