HomeNewsLatest Newsవైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు

వైద్యులపై దాడిచేస్తే ఏడేళ్ల జైలు

దాడులకు పాల్పడేవారికి  రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకూ జరిమానా
వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముం దుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను బుధవారం కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా పరిగణించింది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పు లు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా  ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది. కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం అనంతరం మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియా సమావేశంలో  వివరాలు వెల్లడించారు.  కరోనాపై దేశాన్ని కాపాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు జరగడం హేయమన్నారు.  వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే కేసు తీవ్రతను బట్టి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని, నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి రూ లక్ష నుంచి రూ ఐదు లక్షల వరకూ జరిమానా విధిస్తామని చెప్పారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెండింతలు వసూలు చేస్తామని అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. 50 లక్షల మాస్క్‌లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.  రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుందని తెలిపారు. క్లిష్టమైన సమయంలో వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారని జవదేకర్‌ కొనియాడారు.  కొవిడ్‌ బాధితులకు ఆయుష్మాన్‌ భారత్‌  కింద చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కరోనాపై పోరుకు రూ.15వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విమాన సేవలు ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవల పునరుద్ధరణకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని జవదేకర్‌ చెప్పారు. ఇక కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే 3 వరకూ విధించిన లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులను కేంద్ర మంత్రివర్గం సమీక్షించిందని చెప్పారు. లాక్‌డౌన్‌ నియమ నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పర్యవేక్షించామని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments