విలీనం ప్రసక్తే లేదు

అఖిలపక్ష సమావేశం, జెఎసితో చర్చలు ఉండవు
విధులకు రానివారిపై వేటు
ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే సర్వీసులు
బ్లాక్‌మెయిల్‌కు ప్రభుత్వం తలవంచదు
15 రోజుల్లో ఆర్‌టిసికి పూర్వస్థితి
అధ్యయనానికి సునీల్‌శర్మ నేతృత్వంలో కమిటీ

ఉన్నోళ్లే ఉద్యోగులు
మిగిలింది 1200 ఉద్యోగులే
ఇక సిబ్బంది నియామకం
కొత్తగా చేరేవారు యూనియన్‌లో చేరబోమని సంతకం పెట్టాలి
2500 అద్దెబస్సులను నడిపిస్తాం

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లో టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక నుంచి ఆర్‌టిసి జెఎసి నేతలతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆర్‌టిసికి సంబంధించి, ఎప్పటి కీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్‌ మెయిల్‌ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని ప్రభుత్వం భావిస్తున్నదని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఏటా రూ.1200 కోట్ల నష్టంతో, రూ.5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్‌ ధరలతో, ఆర్‌టిసి ఇబ్బందుల్లో వున్న సమయంలో, అదీ పండుగల సీజన్‌లో చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది తీవ్రమైన తప్పిదమని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్‌టిసికి సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, టిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగ నాయకులున్నారు. కమిటీ సభ్యులు తమ ప్రతిపాదనలను సోమవారం ప్రభుత్వానికి సమర్పిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానీయా, అడిషనల్‌ డిజిపి జితేంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఇచ్చిన గడువు పూర్తయ్యే లోపల విధులకు హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్‌టిసిలో మిగిలింది కేవలం 1200 మంది సిబ్బంది అని సిఎం స్పష్టం చేశారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4114 ప్రైవేటు బస్సులు ఇంకా వున్నాయని, వాటికి స్టేజ్‌ కారేజ్‌గా చేస్తే వాళ్ళు కూడా ఆర్‌టిసిలోకి వస్తారని, ఈ విషయంలో వారితో ఆర్‌టిసి, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారన్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని, కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్‌ పీరియడ్‌ వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏ ఏ కేటగిరీకి చెందిన సిబ్బంది సమ్మెకు పోయారో ఆయా కేటగిరిలకు చెందిన సిబ్బందిని భర్తీ చేయడానికి నియామకం వుంటుందని ఆయన అన్నారు. ఆర్‌టిసి నడపనున్న బస్సుల్లో సగం ప్రైవేట్‌ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్‌టిసి యాజమాన్యానికి సంబంధించినవని నిర్ణయం జరిగింది.

DO YOU LIKE THIS ARTICLE?