విరాట్‌ విశ్వరూపం

పుణే: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య టీమిండియా రెండో రోజే పట్టుబిగించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 601 పరుగులు చేసి డిక్లేర్డ్‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరును అందుకోవాలంటే సౌతాఫ్రికా మరో 565 పరుగులు చేయాలి. ఇప్పటికే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో సఫారీకు ఈ మ్యాచ్‌లో కూడా కష్టాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఉమేశ్‌ యాదవ్‌ ఓపెనర్ల వికెట్లను తీసి సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బతీశాడు. ఓపెనర్లు డీన్‌ ఎల్గర్‌ (6), ఐడెన్‌ మార్‌క్రామ్‌ (౦)లను ఉమేశ్‌ వెనక్కి పంపాడు. మరోవైపు కీలక ఆటగాడు బవుమా (8)ను షమి ఔట్‌ చేశాడు. దీంతో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్‌ డుప్లెసిస్‌, వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌లపైనే ఆధారపడి ఉంది. వీరిద్దరూ రాణిస్తేనే సఫారీలు కష్టాల్లోంచి గట్టెక్కే ఛాన్స్‌ ఉంది. లేకుంటే మరోసారి చేదు అనుభవం తప్పక పోవచ్చు. అంతకుముందు భారత్‌ను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 254 (నాటౌట్‌) చారిత్రక బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. అజింక్య రహానె (58), రవీంద్ర జడజా (91) తమవంతు పాత్ర పోషించడంతో భారత్‌ భారీ స్కోరును సాధించింది.
ఇద్దరూ అద్భుత బ్యాటింగ్‌తో..
ఓవర్‌నైట్‌ స్కోరు 273/3తో శుక్రవారం రెండో రోజు బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కు విరాట్‌ కోహ్లి, అజింక్య రహానెలు అండగా నిలిచారు. ఇద్దరూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కోహ్లి తన మార్క్‌ షాట్లతో అలరించాడు. రహానె కూడా చూడచక్కని బ్యాటింగ్‌తో కనువిందు చేశాడు. ఇటు కోహ్లి, అటు రహానె కుదురుగా ఆడడంతో భారత్‌ స్కోరు వేగంగా ముందుకు సాగింది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు దూకుడును ప్రదర్శించడంతో స్కోరు వేగంగా కదిలింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ స్కోరును నడిపించారు. ఇదే క్రమంలో రహానె 8 ఫోర్లతో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన కోహ్లి 173 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీని పూర్తి చేశాడు. కోహ్లి కెరీర్‌లో ఇది 26వ టెస్టు శతకం కావడం విశేషం. లంచ్‌ సమయానికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. అయితే భోజన విరామం ముగిసిన వెంటనే రహానె (58) వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో కోహ్లితో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 178 పరుగులు జోడించాడు.

విరాట్‌ వీరవిహారం..

రహానె ఔటైనా కోహ్లి తన జోరును కొనసాగించాడు. సెంచరీ తర్వాత కోహ్లి దూకుడును పెంచాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. అతనికి రవీంద్ర జడేజా అండగా నిలిచాడు. ఇటు కోహ్లి, అటు జడేజా దూకుడును ప్రదర్శించడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఇదే సమయంలో భారత్‌కు మరో కీలక భాగస్వామ్యం లభించింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి 23 బౌండరీలతో 150 పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగి పోయాడు. దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరును పరిగెత్తించాడు. జడేజా కూడా ధాటిగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టాలని సఫారీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో టి సమయానికి భారత్‌ స్కోరు 4 వికెట్ల నష్టానికి 473 పరుగులకు చేరింది. ఆట తిరిగి ప్రారంభం కాగానే కోహ్లి డబుల్‌ సెంచరీని పూర్తి చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి 295 బంతుల్లో 28 ఫోర్లతో 200 పరుగులు చేశాడు. టెస్టుల్లో కోహ్లికి ఇది ఏడో డబుల్‌ సెంచరీ కావడం విశేషం. అంతేగాక ఏడు డబుల్‌ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. డబుల్‌ సెంచరీ తర్వాత కూడా కోహ్లి దూకుడు కొనసాగించాడు.
సెంచరీకి కొద్ది దూరంలో..
మరోవైపు రవీంద్ర జడేజా కూడా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. వన్డేలను తలపిస్తూ అతని బ్యాటింగ్‌ సాగింది. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే వీలు దొరికితే ఫోర్లు బాదుతూ స్కోరును ముందుకు నడిపించాడు. కోహ్లి కూడా జడేజాకు బ్యాట్‌ చేసే అవకాశం ఇచ్చాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన జడేజా సెంచరీకి కొద్ది దూరంలో ఔటయ్యాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన జడేజా 104 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేసి ముత్తుస్వామి బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా ఔటైనా వెంటనే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు.

స్కోరుబోర్డు
భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబడా 108, రోహిత్‌ శర్మ (సి) డికాక్‌ (బి) రబడా 14, చటేశ్వర్‌ పుజారా (సి) డుప్లెసిస్‌ (బి) రబడా 58, విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 254, అజింక్య రహానె (సి) డికాక్‌ (బి) కేశవ్‌ మహారాజ్‌ 59, రవీంద్ర జడేజా (సి) బ్రూయిన్‌ (బి) ముత్తుస్వామి 91, ఎక్స్‌ట్రాలు 17, మొత్తం 156.3 ఓవర్లలో 601/5 డిక్లేర్డ్‌.
బౌలింగ్‌: ఫిలాండర్‌ 26 కగిసో రబడా 30 అన్రిచ్‌ నోర్జె 25 కేశవ్‌ మహారాజ్‌ 50 ముత్తుస్వామి 19.3 డీన్‌ ఎల్గర్‌ 2
సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌: డీన్‌ ఎల్గర్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 6, ఐడెన్‌ మార్‌క్రామ్‌ ఎల్బీ ఉమేశ్‌ యాదవ్‌ 0, డి బ్రూయిన్‌ (బ్యాటింగ్‌) 20, బవుమా (సి) సాహా (బి) షమి 8, అన్రిచ్‌ నోర్జే (బ్యాటింగ్‌) 2, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం 15 ఓవర్లలో 36/3.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 4 ఉమేశ్‌ యాదవ్‌ 4 రవీంద్ర జడేజా 4 మహ్మద్‌ షమి 3

DO YOU LIKE THIS ARTICLE?