విమానం ఇంజన్‌లో మంటలు

అమెరికాలో తప్పిన పెను ప్రమాదం
బ్రూమ్‌ఫీల్డ్‌: అమెరికా యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్‌ కాగానే ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. అత్యవసరంగా భూమిపైకి దిగే ప్రయత్నంలో ఇంజన్‌ శకలాలు డెన్వర్‌ నగరం పరిసర ప్రాంతంలో చెల్లాచెదురుగా పడ్డాయి. మొత్తానికి 241 మందితో వెళ్తున్న విమానానికి పెనుప్రమాదం తప్పిపోయింది. ఈ సంఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. అమెరికాలో శనివారం డెన్వర్‌ నుంచి హొనొలులుకు బయల్దేరిన బోయింగ్‌ 777 200 విమానం టేకఫ్‌ కాగానే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అందులో 231 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నా రు. అయితే పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. మండుతున్న విమానం ఇంజన్‌ భాగాలు డెన్వర్‌ పరిసర ప్రాంతాల్లో పడిపోయాయి. ఇంజన్‌ శకలాలు ఆకాశంలో నల్లటి పొగతో బూడిదగా మారి గాలిలోకి విడుదల అయ్యాయి. పైలట్లు విమానాన్ని డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరగకపోవడం గమనార్హం. అయితే ఇంజన్‌ విఫలం కావడంతో విమానంలో ఉన్నవాళ్లూ, నేలపైన ఉన్నవాళ్లూ భయభ్రాంతులకు లోనయ్యారు. అంతా అయిపోయిందనుకున్నాం, కానీ పైలట్‌ అద్భుతం చేశాడని ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని వెల్లడించారు. నేలపై ఉన్నవాళ్లు ఎవరికైనా ప్రమాదం జరిగితే తమకు తెలియజేయాలని పోలీస్‌లు సూచించారు. టేకాఫ్‌ కాగానే విమానం ఇంజన్‌ విఫలమైందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక విమాన ప్రమాదంపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ పరిశోధన చేస్తోంది. అయితే ఇంజన్‌లో వైఫల్యానికి గల కారణాల గురించి అధికారులు ఎలాంటి వివరాలూ తెలపలేదు. విమానం ఇంజన్‌లో పేలుడు సంభవించడం, తర్వాత నేలపై ఇంజన్‌ భాగాలు పడిపోవడం గురించి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనలో ఓ పది నిమిషాల పాటు ఇంజన్‌ శకలాలు, బూడిద భూమిపై పడ్డాయి. కొన్ని మీటర్ల తేడాతో విమానం ఇంటిపై కూలే ప్రమాదం తప్పిపోయింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని, ఇంజన్‌లో జరిగే సాంకేతికమైన పొరపాట్ల కారణంగా ఇలా జరుగుతుందని వైమానిక భద్రతా నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనల్లో పైలట్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మంటలు తలెత్తిన వెంటనే ఇంధనం, హైడ్రాలిక్‌ ఇంధనం సహా ఇంజన్‌ను నిలిపివేయాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ప్రమాదం 2018 ఏప్రిల్‌లో న్యూయార్క్‌ నుంచి డల్లాస్‌కు వెళ్లే సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో జరిగింది. పెన్సిల్వేనియా గగనతలంలో 30,000 అడుగుల ఎత్తులో విమానం విఫలమైన అప్పటి సంఘటనలో ఓ ప్రయాణికుడు మరణించాడు.

DO YOU LIKE THIS ARTICLE?