వినియోగించిన విద్యుత్‌కే బిల్లు

విద్యుత్‌ బిల్లులు పెంచలేదు
ఉన్న టారిఫ్‌లతోనే బిల్లుల పంపిణీ : ఎస్‌పిడిసిఎల్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : విద్యుత్‌ బిల్లులు జారీ చేయడంలో ఎలాంటి తప్పులు జరగడం లేదని, వినియోగించిన విద్యుత్‌కే బిల్లులను ఇస్తున్నామని, ఎస్‌పిడిసిఎల్‌ ప్రభుత్వ సంస్థ అని, వినియోగదారులకు ఎలాంటి సమస్య ఉండదని, వినియోగదారులు బిల్లులు చెల్లించాలని టిఎస్‌ ఎస్‌పిడిసిఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ బిల్లులు పెంచడం లేదని, ఉన్న టారిఫ్‌లో మాత్రమే బిల్లులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ కారనంగా ప్రజలంతా బయటకు వెళ్ళకుండా ఇళ్లలోనే ఉన్నందున గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వేసవికాలంలో విద్యుత్‌ వాడకం పెరిగిందన్నారు. వేసవి కాలంలో విద్యుత్‌ వినియోగం పెరగడం వల్ల యూనిట్లు పెరిగి స్లాబ్‌ మారితే బిల్లులు కూడా పెరుగుతాయని ఆయన వివరణ ఇచ్చారు. ఒక వేళ వినియోగదారులు తాము వాడుకున్న విద్యుత్‌ కంటే ఎక్కువ బిల్లులు చెల్లిస్తే వచ్చే నెలలో సర్దుబాటు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇఆర్‌సి అనుమతి తీసుకునే బిల్లులు ఇచ్చామని తెలిపారు. తమ దష్టికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వివరణ ఇచ్చామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు, అనుమానాలు ఉంటే సంబంధిత సిబ్బంది, అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. విద్యుత్‌ వినియోగదారులు మార్చిలో 67 శాతం, ఏప్రిల్‌ నెలలో 44 శాతం, మే నెలలో68 శాతం మంతి విద్యుత్‌ చార్జీలు చెల్లించారని వివరించారు. ఏప్రిల్‌, మే నెలలలో లాక్‌డౌన్‌ ఉందని, జూన్‌ మాసంలో సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సిబ్బంది ఇంటింటికి తిరిగి బిల్‌లు ఇస్తున్నారని, ఈ నెల 15 లోపు రీడింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. మీటర్‌ రీడర్స్‌ గత మూడు నెలలు పని చేయలేదు, అయినప్పటికీ వాళ్లకు 50 శాతం జీతాలు ఇవ్వాలని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?