విద్య కాషాయీకరణ

పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్‌ చాప్టర్‌ తొలగింపు
కర్నాటకలో రాజకీయ దుమారం
బెంగళూరు : కేంద్ర బిజెపి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్య కాషాయీకరణకు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో విద్య కాషాయీకరణకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తాజాగా కర్నాటక లో మొఘల్స్‌, రాజపుత్రులు, జీసస్‌, మహ్మద్‌ప్రవక్తలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించా రు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ సిలబస్‌ను సీబీఎస్‌ఈ తగ్గించిన అనంతరం కర్ణాటక సైతం ఈ దిశగా అడుగులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో సిలబస్‌ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్‌ పాలకులు హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ చాప్టర్‌లను తొలగించింది. విద్యార్ధుల సౌలభ్యం కోసం కర్ణాటక టెకస్ట్‌బుక్స్‌ సొసైటీ పలు పాఠ్యాంశాలను సిలబస్‌ నుంచి తొలగించింది. మొఘల్‌, రాజ్‌పుత్‌ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్‌, మహ్మద్‌ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దుల పద్దులో చేరాయి. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్‌ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యా  సంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది 120-140 పనిదినాలే లక్ష్యంగా సిలబస్‌ను కుదించారు. కాగా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్‌ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్‌ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాలను సిలబస్‌ క్రమబద్ధీకరణతో లేదా ఎన్‌సీఈఆర్‌టీ ప్రత్యామ్నాయ అకడమిక్‌ కేలండర్‌ ద్వారా కవర్‌ అవుతాయని సీబీఎస్‌ఈ ఆ తర్వాత వివరణ ఇచ్చింది. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన చాప్టర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది.

DO YOU LIKE THIS ARTICLE?