HomeNewsBreaking Newsవిద్యార్థిని మృతితో తమిళనాడులో హింస

విద్యార్థిని మృతితో తమిళనాడులో హింస

కల్లకురిచ్లి : విద్యార్థిని మృతితో తమిళనాడులోని కల్లకురిచిలో ఆదివారం పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆందోళనకారులు రోడ్లపై పరుగులు తీస్తూ విధ్వంసానికి దిగారు. వాహనాలకు నిప్పుపెట్టారు. రాళ్లురువ్వారు. మృతి చెందిన విద్యార్థినికి న్యాయం చేయాలంటూ డిమాండు చేశారు. హింసకు దిగిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రెండుసార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు దిగవద్దని, ప్రశాంతతను పాటించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. విద్యార్థిని మృతి ఘటనలో దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కల్లకురుచికి ఉన్నతాధికారులను పంపినట్టు స్టాలిన్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు. చిన్నసాలెంలోని ఓ ప్రైవేటు రెసిడెన్సియల్‌ కాలేజీలో 12వ తరగతి చదువుకున్న 17 ఏళ్ల బాలిక ఈనెల 13న హాస్టల్‌ ఆవరణలో మృతిచెంది కనిపించింది. హాస్టల్‌ మూడో అంతస్తులో ఉంటున్న బాలిక అక్కడ్నించి కిందకు దూకి చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మరణానికి ముందు ఆమె ఒంటిపై గాయాలైనట్టు పోస్ట్‌మార్టం నివేదక వెల్లడిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తమ కుమార్తె మరణం విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రుతో పాటు బంధువులు, పెరియానసలూర్‌ గ్రామస్థులు పలువురు నిరసనలకు దిగారు. న్యాయం జరగలాంటూ నిరవధిక నిరసనలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ స్కూలు అధికారుల నిర్లక్షమే విద్యార్థిని మృతికి కారణమని ఆరోపిస్తూ వారు సాగిస్తున్న ఆందోళన ఆదివారంనాడు నాలుగోరోజుకు చేరుకుంది. బాలిక మృతికి కారణమైన వారిని అరెస్టు చేసేందుకు సిబిసిఐడి విచారణ జరపాలని బాధితులు డిమాండ్‌ చేశారు. కాగా, వారి న్యాయపరమైన డిమాండ్లకు వామపక్ష యువజన విభాగం మద్దతు పలికింది. విద్యార్థిని మృతితో చిన్నసాలెం సమీపంలోని అంతర్జాతీయ స్కూలు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. సంస్థ ఆవరణలో నిలిపి ఉంచిన బస్సులకు నిప్పుపెట్టారు. ఒక పోలీస్‌ బస్సు కూడా మంటల్లో తగులబడింది. ఒక బస్సును తలకిందులు చేసి సుత్తులతో పగులగొట్టారు. పలువురు ఆందోళకారులు టెర్రాస్‌ పైకి చేరుకుని నేమ్‌బోర్డును ధ్వంసం చేశారు. బ్యానర్లు చూపిస్తూ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారికి నచ్చచెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో సమీప జిల్లాల్లోని పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు స్కూలు ఆవరణలో విధ్వంసం సృష్టించడంతో పాటు ఫర్నిచర్‌, అల్మారా వంటి వస్తులను బయటకు తెచ్చి రోడ్డుపై కుప్పగా పోసి నిప్పుపెట్టారు. రాళ్లు రువ్వుడు ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు రోడ్డు దిగ్బంధన నిరసనలకు దిగడంతో చెన్నై-సాలెం హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో డిజిపి సైలేంద్ర బాబు స్పందిస్తూ ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హింసాకాండకు దిగవద్దని హెచ్చరించారు. హింసాకాండలో పాల్పడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments