ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్.. రాణించిన షమీ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్
30 ఏళ్ల తర్వాత ఫాలోఆన్‌లో కంగారూ జటు
నాలుగో రోజు కూడా వర్షంతో ఆగిన ఆట
ప్రస్తుతం ఆసీస్ 6/0.. చివరి టెస్టు
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. నాలుగో రోజు ఆట కూడా వర్షం, వెలుతురులేమి కారణంగా మ్యాచ్ మరోసారి ముందుగానే ఆగిపోయింది. తొలి సెషన్ వర్షం కారణంగా మొదలుకాలేదు. వాతావరణం అనుకూలించిన తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ఆదివారం 236/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 322 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించాడు. భారత బౌలర్ల ధాటికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తమ సొంతగడ్డపై ఫాలో ఆన్ ఆడడం విశేషం. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సమయానికే వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. ఆ సమయంలో ఆసీస్ (4 ఓవర్లలో) వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (12 బంతుల్లో 4), మార్కస్ హారిస్ (12 బంతుల్లో 2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తర్వాత బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ముందుకు సాగలేదు. చివర్లో అంపైర్లు నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం నాలుగో రోజు భారత్ కేవలం 25.2 ఓవర్లు మాత్రమే వేయగలిగింది. ఒకవేళ పూర్తి ఓవర్లు వేసి ఉంటే కోహ్లీసేనకు మంచి ఫలితం దక్కేది. మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా బౌలర్లు ఈ రెండు రోజుల్లో ఫాలో ఆన్ బారిన పడిన ఆసీస్ జట్టును సులువుగా ఆలౌట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పటికే 2 సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్టును కూడా గెలిచి 3 చారిత్రక విజయాన్ని నమోదు చేసుకోవాలనుకుంది. కానీ టీమిండియా గెలుపుకు వరణుడు పదే పదే అడ్డు పడుతున్నాడు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసేటట్టు కనిపిస్తోంది. సోమవారం చివరి రోజు ఆటలో టీమిండియా 10 వికెట్లు పడగొడితే ఆఖరి టెస్టులోనూ టీమిండియాకు విజయం వరిస్తోంది. మరోవైపు ఆసీస్ ఓటమిని తప్పించుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలనుకుంటే ఒక్క రోజు మొత్తం క్రీజులో నిలవాల్సిందే. ఇక వాతావరణాన్ని చూస్తుంటే చివరి రోజు కూడా మ్యాచ్ పూర్తి ఓవర్లు సాధ్యపడనట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఆఖరి టెస్టు డ్రా అయిన కూడా ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్‌కు చారిత్రక విజయం ఖాయం.
ఆదిలోనే షాక్..
ఆదివారం 236/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియాకు ఆరంభం కలిసిరాలేదు. ముందు వర్షం కారణంగా మొదటి సెషన్ ఆట జరగలేదు. తర్వాత వర్షం ఆగాక మ్యాచ్ తిరిగి మొదలైంది. మంచి ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు ఆదిలోనే ఆసీస్‌కు షాకిచ్చారు. క్రిందటి రోజుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ (25; 44 బంతుల్లో 6 ఫోర్లు)ను మహ్మద్ షమీ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత మరో సెట్ బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్స్‌కొంబ్ (37; 111 బంతుల్లో 5 ఫోర్ల)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ దారి చూపెట్టాడు. తర్వాత మరో పరుగు వ్యవధిలోనే నాథన్ లియాన్ (0)ను ఖాతా తెరువకుండానే కుల్దీప్ యాదవ్ వెనుకకు పంపాడు. దీంతో ఆసీస్ 258 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. అనంతరం మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్ చివరి వికెట్‌కు 42 పరుగులు జోడించి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. చివర్లో కుల్దీప్ తెలివైన బంతితో దూకుడుగా ఆడుతున్న హేజిల్‌వుడ్ (45 బంతుల్లో 21)ను ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో ఆస్ట్రేలియా (104.5 ఓవర్లలో) 300 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టగా.. జడేజా, షమీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బుక్రా ఒక్క వికెట్ తీశాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు 322 పరుగులతో వెనుకడటంతో ఫాలోఆన్ బారిన పడింది. ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది సేపటికే మరోసారి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో నాలుగో రోజు ఆటలో ఆసీస్ జట్టు 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (4 బ్యాటింగ్), హారిస్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
కొత్త చరిత్ర సృష్టించబోతున్న కోహ్లీసేన..
కోహ్లీ సేన కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయింది. సోమవారం జరిగే ఆఖరి రోజు ఆటలో గెలిచినా, డ్రా చేసుకున్న నయా చరిత్ర మాత్రం ఖాయం. టీమిండియాలో ఇప్పటి వరకు ఏ సారథికి సాధ్యంకాని అరుదైన ఘనతను కోహ్లీ అందుకోననున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుపోయే అరుదైన రికార్డు కోహ్లీ సేనకు సొంతం కానుంది. అస్ట్రేలియా గడ్డపై ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం ఈసారి పూర్తి కానుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 2 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ ఫలితం ఇంకారాలేదు. ఆఖరి టెస్టులో కూడా టీమిండియాకు విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయ్యే చాన్స్ ఉంది. ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో విజయంతో బోణీ కొట్టిన కోహ్లీ సేన తర్వాత పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో తడబడి ఓటమిపాలైంది. అనంతరం మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో తిరిగి పుంజుకున్న భారత్ గొప్ప విజయం సాధించింది. ఇక ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో కూడా భారత ఆటగాళ్లు అదరగొట్టారు. చతేశ్వర్ పుజారా (193), యువ సంచలనం రిషభ్ పంత్ (159 నాటౌట్), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77) అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నంగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. తర్వాత బౌలర్లు రాణించడంతో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కట్టడి చేసి మ్యాచ్‌లో ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ వరుణుడు అడ్డుపడటంతో ఈ మ్యాచ్ నత్త నడకన నడుస్తోంది. మూడు, నాలుగో రోజు ఆట దాదాపు రద్దయింది. ఇక ఒవరాల్‌గా టీమిండియా విషయానికి వస్తే సిరీస్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు అద్భుతమైన పోరాటప్రతిమ కనబర్చుతున్నారు. ఆసీస్ ఫాస్ట్ పిచ్‌లపై భారత్ రికార్డులు చూస్తే భారత్ సిరీస్ డ్రా చేసుకున్న పెద్ద విషయమే అని అనిపించింది. కానీ కోహ్లే సేన ఈసారి అదరగొట్టింది. వారి ఆట అమోఘం. బ్యాటింగ్, బౌలింగ్‌లో కలిసి కట్టుగా రాణించారు. ఒకసారి బౌలర్లు చెలరేగితే.. మరోసారి బ్యాట్స్‌మెన్స్ రాణించారు. అందరూ టీమ్‌గా ఆడటంతో భారత్‌కు గొప్ప విజయాలు దక్కాయి.
భారత్ ఎన్నో కొత్త రికార్డులు
ఈ సిరీస్‌లో భారత్ ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేసుకుంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా సంచలనం సృష్టించాడు. ఆసీస్ గడ్డపై ఒక సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ ధాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ విలవిలలాడారు. నిప్పులు చెరిగే బంతులతో కంగారూ జట్టులో కంగారూ పుట్టించాడు. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లతో పటిష్టంగా ఉండే ఆసీస్ బ్యాటింగ్ దళంను బుమ్రా ముక్కలుముక్కలు చేశాడు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను హడలెత్తించాడు. ఈ సిరీస్‌లో తన కెరీర్ అత్యుత్తమ బౌలింగ్‌ను ప్రదర్శించిన బుమ్రా అందరి ప్రశసంలు అందుకున్నాడు. భారతీయ క్రికెటర్లే కాకుండా ఆసీస్ మాజీలు కూడా బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అశ్విన్, జడేజాలు కూడా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టకున్నారు. భారత్ విజయాల్లో తమ వంతు సహకారాలు అందించారు. ఇక బ్యాటింగ్‌లో నయావాల్ చతేశ్వర్ పుజారా అసాధారణ బ్యాటింగ్‌తో రాణిస్తున్నాడు. విదేశీగడ్డపై ఎవరికి అందని రికార్డులను సొంతం చేసుకొంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించాడు. పిచ్‌పై నిలబడి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇతని అద్భుతమైన బ్యాటింగ్ ఎందరో యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలుస్తోంది. ఆసీస్ బౌలర్లు సైతం పుజారా బ్యాటింగ్‌ను కొనియాడుతున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా మంచి ప్రదర్శనలతో రెండు శతకాలు బాదేశాడు. కీలకమైన సమయాల్లో రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇక రిషభ్ పంత్ అటూ కిపీంగ్తో పాటు ఇటూ బ్యాటింగ్‌లో కూడా మంచి వైవిధ్యాలు చూపెడుతున్నారు. 21 ఏళ్ల వయసులోనే అనుభవజ్ఞమైన క్రీడాకారుణిగా ఆడుతున్నాడు. ఇక ఇతర బ్యాట్స్‌మెన్స్ కూడా కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలుస్తుండటంతో టీమిండియా ఆసీస్‌పై చేయి సాధిస్తున్నది. ఈ సిరీస్‌లో కోహ్లీ సేన పోరాటం అమోఘమని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.
విజయానికి వరుణుడి అడ్డంకి
RELATED ARTICLES