విక్రమ్‌ ల్యాండర్‌ దిగింది ఇక్కడే!

కానీ జాడ దొరకలేదు
ఫొటోలు విడుదల చేసిన నాసా

వాషింగ్టన్‌: చంద్రుడిపైకి భారత్‌ రెండో ప్రయోగం అయిన చంద్రయాన్‌ సంబంధించిన ల్యాండర్‌ ‘విక్రమ్‌’ హార్డ్‌ ల్యాండింగ్‌ అయిందన్న విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ శుక్రవారం బలపరిచింది. నాసాకు చెందిన లూనార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా (ఎల్‌ఆర్‌ఒసి) చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్‌- సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో భావించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్‌ నుంచి వేరయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్‌ ఫొటోలను నాసా విడుదల చేసింది. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. విక్రమ్‌ ల్యాండర్‌ ఉన్న ప్రదేశంపై నుంచి అమెరికా ఎల్‌ఆర్‌ఒ అక్టోబర్‌ 14న దాటి వెళుతున్నప్పుడు మరింత అనుకూలమైన వెలుగులో స్పష్టమైన ఫోటోలు తీయగలదని గాడర్డ్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ సెంటర్‌ ఎల్‌ఆర్‌ఒ మిషన్‌ డిప్యూటీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్‌ ఇ ద్వారా పిటిఐ వార్తా సంస్థకు రాశారు. చంద్రయాన్‌ విజయవంతంగా ల్యాండింగ్‌ అయి ఉంటే రష్యా, అమెరికా, చైనా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో చరిత్ర లిఖించి ఉండేది. కానీ ఆ రికార్డు కొద్దిలో తప్పిపోయింది.

DO YOU LIKE THIS ARTICLE?